3 May, 2026 | 1:49 AM

‘కోహినూర్’ ఆశలు సజీవం

03-05-2026 12:43 AM
  1. అంతర్జాతీయ వేదికలపై మళ్లీ చర్చ
  2. తెరపైకి వజ్రం అప్పగింత అంశం
  3. భారత్‌కు అనుకూలంగా న్యూయార్క్ మేయర్ మామ్దానీ వ్యాఖ్యలు

న్యూయార్క్, మే ౨: బ్రిటిష్ రాచరికపు కిరీటంలో ధగధగమెరుస్తున్న వెలకట్టలేని కోహినూర్ వజ్రం భారతదేశపు ఆత్మగౌరవానికి ప్రతీక. ఈ అపురూపమైన వజ్రాన్ని తిరిగి భారత్‌కు రప్పించాలనే డిమాండ్ ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై మరోసారి మారుమోగింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్‌ను కలిసే ముందు న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించాయి.

భారత సంతతికి చెందిన మమ్దానీ తనకు అవకాశం వస్తే కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు అప్పగించాలని రాజును కోరతానని కుండబద్దలు కొట్టారు. 9/11 అగ్ర దాడుల్లో అమరులైన వారి సంస్మరణ కార్యక్రమంలో వీరిద్దరూ కలుసుకున్న వేళ ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వంద క్యారెట్ల పైచిలుకు బరువు ఉండే ఈ వజ్రం ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రాల్లో ఒకటి. భారత్ గడ్డపై దొరికిన ఈ వజ్రం మొఘలుల నుంచి పర్షియన్ల వరకు ఎందరో పాలకుల చేతులు మారింది. తర్వాత పంజాబ్ సిక్కు రాజుల వద్దకు చేరిం ది. 1849లో చివరకు బ్రిటిష్ పాలకుల వశమైంది. అప్పటి పసివాడైన మహారాజా దులీప్ సింగ్‌ను ఒప్పందం పేరుతో బెదిరించి, బ్రిటిష్ సైనికులు వజ్రాన్ని తీసుకెళ్లారనేది చూచాయిగా చరిత్ర. 

గతంలోనూ అనేక ప్రయత్నాలు

కోహినూర్‌ను తిరిగి భారత్‌కు రప్పించేందుకు గతంలోనూ అనేక ప్రయత్నాలు జరిగాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లోనే భారత్‌కు వజ్రం అప్పగించాలని, ఆ అప్పగింత తమ అధికారికంగా హక్కు అని కూడా పేర్కొంది. తర్వాత 1953లో క్వీన్ ఎలిజబెత్ పట్టాభిషేక సమయంలోనూ భారత్ మరోసారి డైమండ్ అప్పగించాలని విజ్ఞప్తి చేసింది. ఒడిశాలోని జగన్నాథ ఆలయానికి ఈ వజ్రాన్ని అప్పగించాలని అనేకమంది భక్తులు, నాయకులు పలుమార్లు డిమాండ్ చేశారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం దీని ని తిరిగి తీసుకురావాలని భారత ప్రభుత్వం దౌత్యపరమైన ఒత్తిడి పెంచుతూనే ఉంది.

బ్రిటిష్ ప్రభుత్వం మాత్రం చట్టబద్ధమైన ఒప్పందం ద్వారానే తమకు డైమండ్ దక్కిందని వాదిస్తోంది. ఇలాంటి పరిణామాల క్రమంలో తాజాగా మమ్దానీ చేసిన వ్యాఖ్య లు భారత్ సుదీర్ఘ పోరాటానికి కొత్త రూపా న్ని ఇచ్చాయి. డైమండ్ కేవలం ఒక మెరిసే ఆభరణం మాత్రమే కాదు, భారత దేశ సంస్కృతికి, చరిత్రకు సజీవ సాక్ష్యం. అందుకే ప్రతి భారతీయుడు వజ్రం భారత్‌కే దక్కాలని ఆకాంక్షిస్తున్నాడు. ఎప్పటికైనా వజ్రం ఇండియాకు రావాలని మనసారా కోరుకుంటున్నాడు.