18 July, 2026 | 11:49 AM

Breaking News

పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!

18-07-2026 11:44 AM

కోదాడ జూలై 18,(విజయక్రాంతి): కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్(Kodad Traffic Police Station) భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రతి వర్షానికీ పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వల్ప వర్షం కురిసినా పైకప్పు నుంచి నీరు కారుతూ కార్యాలయం మొత్తం తడిసిపోతోంది. వర్షపు నీరు లోపలికి రాకుండా ఉండేందుకు పోలీసులు పైకప్పుకు తాత్కాలికంగా ప్లాస్టిక్ పట్టాలు(Plastic sheets) కప్పుకుని విధులు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కార్యాలయ రికార్డులు, కంప్యూటర్లు, ఇతర సామగ్రి దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. శిథిలావస్థలో ఉన్న భవనంలోనే విధులు నిర్వహించాల్సి రావడంతో సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి భవనానికి శాశ్వత మరమ్మతులు చేపట్టడంతో పాటు ఆధునిక సౌకర్యాలతో కూడిన కొత్త భవనాన్ని నిర్మించాలని పోలీసులు, స్థానికులు కోరుతున్నారు.