100కు పైగా మోకాలి మార్పిడి ఆపరేషన్లు
ఎంఏఎంఎస్ హాస్పిటల్‌లో ఉచితంగా నిర్వహణ
డా.పువ్వాడ నయన్‌రాజ్ జన్మదినం సందర్భంగా పేదలకు ఉచిత వైద్యం
హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని బాచుపల్లిలో గల మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో డాక్టర్ పువ్వాడ నయన్ రాజ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సేవా కార్యక్రమంలో భాగంగా, ఎంఏఎంఎస్ హాస్పిటల్స్ పేద, నిరుపేద రోగులకు మరో 40కుపైగా ఉచిత మోకా లి మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించింది. దీంతో ఇప్పటివరకు 100కు పైగా ఉచిత మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేసి, వందకుపైగా కుటుంబాల్లో కొత్త ఆశను నింపినట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.
ఈ సందర్భంగా ఎంఏఎంఎస్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ పువ్వాడ నయన్ రాజ్ మాట్లాడుతూ, తన జన్మదినాన్ని వ్యక్తిగత వేడుకగా కాకుండా సమాజ సేవకు అంకితం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మోకాళ్ల సమస్యలతో బాధపడుతున్న అనేక మంది రోగులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా శస్త్రచికిత్స చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారికి అత్యాధునిక వైద్యాన్ని పూర్తిగా ఉచితంగా అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
మాజీ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎంఏఎంఎస్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పువ్వాడ నయన్ రాజ్, కార్యనిర్వాహక సంచాలకురాలు పువ్వాడ అపర్ణ రాజ్, సూపరింటెండెంట్ డాక్టర్ బ్రిగేడియర్ పీఎస్‌కే పటేల్, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఫిజియోథెరపీ విభాగం, పరిపాలనా బృందం, ఆసుపత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధులు, సామాజిక ప్రముఖులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.






