12 May, 2026 | 2:05 AM

కిల్లర్ మిల్లర్

12-05-2026 01:06 AM
  1. మాధవ్ తివారీ ఫినిషింగ్ టచ్
  2. పంజాబ్‌కు మరో ఓటమి

పంజాబ్‌కు ఢిల్లీ షాక్ 

అక్షర్ పటేల్, మిల్లర్ మెరుపులు

ఐపీఎల్ 19వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ షాకిచ్చింది. గెలిచే మ్యాచ్‌లో చెత్త బౌలింగ్ తో పరాజయం పాలైంది.  దాదాపుగా ప్లే ఆఫ్ రేసుకు దూరమైన ఢిల్లీ అనూహ్యంగా గెలిచింది. అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీకి తోడు చివర్లో మిల్లర్ విధ్వంసకర బ్యాటింగ్, అశుతోష్ శర్మ మెరుపులు విజయాన్ని అందించాయి. పంజాబ్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి. అటు ఢిల్లీకి ఇది ఐదో విజయం. 

ధర్మశాల, మే 11 : ఈ మ్యాచ్‌లో ఐదు మార్పులు చేసిన ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొద ట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిం ది. ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య మరోసారి అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. తొలి వికె ట్‌కు కేవలం 6.5 ఓవర్లలోనే 78 పరుగులు జోడించారు. ప్రియాన్ష్ ఢిల్లీ బౌలర్లను ఉతికారేశాడు. ప్రభ్ సిమ్రన్ (18) ఔటైనా ప్రియాన్ష్ ఆర్య విధ్వంసం సృష్టించాడు. 33 బంతుల్లోనే 56 పరుగులు చేయగా అతని ఇన్నింగ్స్ 6 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి.

ఓపెనర్లు ఔటైన తర్వాత శ్రేయాస్ అయ్యర్ , కూపర్ కన్నోలీ దుమ్మురేపారు. మూడో వికెట్ కు 52 బంతుల్లో 83 పరుగులు చేశా రు. వీరిద్దరినీ కట్టడి చేయడంలో ఢిల్లీ బౌలర్లు విఫలమయ్యారు. ఈ క్రమంలో శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు దూకుడుగా ఆడిన కూపర్ కన్నోలీ 27 బంతుల్లో 38 (3 ఫోర్లు, 2 సిక్స ర్లు) పరుగులు చేయగా... స్టోయినిస్ (1), శశాంక్ సింగ్ (0) వెంట వెంటనే ఔటవడం పంజాబ్ జోరు కు బ్రేక్ పడింది. శ్రేయాస్ అయ్యర్ 36 బంతుల్లో 59 (5 ఫోర్లు, 3 సిక్సర్లు) నాటౌట్, సూర్యాన్ష్ కేవ లం 8 బంతుల్లోనే 21 (2 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా పంజాబ్ కిం గ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 210 పరుగులు చేసింది.

ఛేజింగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలోనే తడబడింది. కేవలం 33 పరుగులకే 3 వికె ట్లు కోల్పోయింది. కెఎల్ రాహుల్ (9), అభిషేక్ పోరెల్ (5), సాహిల్ (13) రన్స్ కు వెనుదిరిగారు. ఈ దశలో స్టబ్స్, అక్షర్ పటేల్ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 41 పరుగులు జోడించారు. స్టబ్స్ (12) రన్స్‌కు ఔటైనా అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్ ఇన్నింగ్స్ కొనసాగించారు. దూకుడుగా ఆడిన వీరి జోడీ 34 బంతుల్లోనే 64 పరుగులు జో డించింది.

అక్షర్ పటేల్ 30 బంతు ల్లో 56 (8 ఫోర్లు, 2 సిక్సర్లు) రన్స్ కు ఔటవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అయితే క్రీజులో ఉన్న మిల్లర్ విధ్వంసం సృష్టించాడు. పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ రెచ్చిపోయాడు. కేవలం 28 బంతుల్లోనే 51 (3 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులు చేసి ఔటయ్యాడు. మిల్లర్  ఔటైన తర్వాత ఢిల్లీ గెలవడం కష్టంగానే కనిపించింది. అయితే అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ కలిసి 14 బంతుల్లోనే 35 రన్స్ చేశారు. దీంతో అస్సలు గెలుపుపై ఆశలు లేని ఢిల్లీ మరో ఓవర్ మిగిలుండగానే 211 పరుగుల టార్గెట్‌ను అందుకుంది. పంజాబ్ కింగ్స్ మరోసారి పేలవ ఫీల్డింగ్‌తో పాటు చెత్త బౌలింగ్‌తో మూల్యం చెల్లించుకుంది.

స్కోరు బోర్డు

పంజాబ్ ఇన్నింగ్స్ : 210/5 ( ప్రియాన్ష్ 56, శ్రేయాస్  59, కన్నో లీ 38 ; స్టార్క్ 2/57, తివారీ 2/40)

ఢిల్లీ ఇన్నింగ్స్ : 211/7 ( అక్షర్ పటేల్ 56, మిల్లర్ 51, అశుతోష్ శర్మ 24  ; అర్షదీప్ 2/21, యశ్ ఠాకూర్ 2/55)