న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు: కేజ్రీవాల్ సంచలన నిర్ణయం
జస్టిస్ స్వర్ణకాంతశర్మ ముందు విచారణకు హాజరుకాలేను
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తికి స్వర్ణకాంతశర్మకు కేజ్రీవాల్ లేఖ
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ విధానం(Delhi Excise Policy) కేసులో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంతపై పూర్తి అవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, హైకోర్టు ఎదుట హాజరుకాకూడదని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించినట్లు తెలిపారు.
న్యాయమూర్తి స్వర్ణకాంతశర్మకు(Justice Swarana Kanta Sharma) కేజ్రీవాల్ రాసిన లేఖలో, తాను స్వయంగా గానీ లేదా న్యాయవాది ద్వారా గానీ హాజరుకాబోనని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీజీ సూత్రాలకు కట్టుబడి, సత్యాగ్రహాన్ని కొనసాగిస్తానని తెలిపారు. జస్టిస్ స్వర్ణకాంతశర్మ ద్వారా న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదన్న కేజ్రీవాల్ ఆమె ముందు వాదనలూ వినిపించకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. మద్యం పాలసీ కేసులో విచారణను మరో బెంచ్ కు మార్చాలని గతంలో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. కేజ్రీవాల్ సహా ఆప్ నేతలు చేసిన విజ్జప్తిని జస్టిస్ స్వర్ణకాంతశర్మ తోసిపుచ్చారు.






