calender_icon.png 24 February, 2026 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయ కమిటీ

24-02-2026 12:36:18 AM

చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం?

ఆలయాభివృద్ధిని విస్మరిస్తున్న ధర్మకర్తలు

కాంట్రాక్టర్లుగా అవతారమెత్తిన కమిటీ సభ్యులు 

భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో విఫలం 

దాతలు ఇచ్చిన విరాళాలపై లెక్కాపత్రం లేని వైనం

ఎల్బీనగర్, ఫిబ్రవరి 23: ప్రసిద్ధ కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయ ధర్మకర్తల కమిటీలో లుకలుకలు బయటకు వస్తున్నాయి. ఆలయాభివృద్ధిని పట్టించుకోకుండా ధర్మకర్తలు కాంట్రాక్టర్లుగా అవతారమెత్తారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాదారులు, పార్కింగ్, కోబ్బరి చిప్పల సేకరణదారులు, కోబ్బరి కాయల విక్రయదారులను కొందరు ధర్మకర్తలు  గురి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందరిని సమన్వయం చేసుకుంటూ దారిలో పెట్టాల్సిన చైర్మన్ నాకేందుకు అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భక్తులు, కొందరు ధర్మకర్తలు వాపోతున్నారు.

దాతలు ఇచ్చిన విరాళాలపై లెక్కాపత్రం లేకపోవడంతో కొందరు కమిటీ సభ్యులు నేడో... మాపో... చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం.  స్వయంభూ కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ ఆలయం దినదినాభివృద్ధి చెందుతున్నా... అందుకనుగుణంగా భక్తులకు సౌకర్యాలు, వసతులు కల్పించడంలో ఆలయాధికారులు, ఆలయ ధర్మకర్తల కమిటీ విఫలమవుతున్నది. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామికి పేరునున్నది. ప్రతి ఏడాది ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నా ఆలయాభివృద్ధి అనుకున్న స్థాయిలో జరగడం లేదు. ఆలయాభివృద్ధికి పని చేయాల్సిన ధర్మకర్తలు తమ ధర్మాన్ని అనుసరించడం లేదు.

చైర్మన్ తోపాటు 13 మందితో కూడిన కొత్త పాలక మండలి కొలువుదీరి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో సర్వసభ్య సమావేశం నిర్వహించలేదు. చైర్మన్, పాలక మండలి సభ్యులు, ఆలయాధికారులు ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బయట నడుస్తున్న రాజకీయాలే ఆలయంలో జరుగుతున్నాయి. చైర్మన్, ఆలయ కార్యనిర్వహణాధికారి విభజన రాజకీయాలు చేస్తున్నట్లు కొందరు ధర్మకర్తలు, భక్తులు ఆరోపిస్తున్నారు. 

ఆలయ పాలకమండలిపై వస్తున్న ఆరోపణలు 

ఈదులకంటి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలోని ధర్మకర్తల మండలిపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులను కొందరు ధర్మకర్తలు కాంట్రాక్టు తీసుకుని చేయిస్తున్నారు. షెడ్ నిర్మాణం, వాటర్ లీకేజీ నివారణ పనులు, స్టోర్ నిర్వాహణ, కోనేరు అభివృద్ధి పనులను కొందరు ధర్మకర్తలు కాంట్రాక్టు తీసుకున్నారు.  భక్తులకు సేవలు అందించాల్సిన బాధ్యతలను పాలక మండలి విస్మరిస్తున్నారు.

పార్కింగ్ నిర్వాహకులు, ఆలయంలో వివిధ పనులకు టెండర్లు దక్కించుకున్న వారిని ధర్మకర్తలు వేధింపులకు గురి చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు ఆరోపణలు వస్తున్నాయి. ఆలయాభివృద్ధికి దాతలు ఇస్తున్న విరాళాలపై పారదర్శకత పాటించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఎనిమిది నెలలు గడుస్తున్నా ఆలయాభివృద్ధికి కనీసం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఇప్పటి వరకు కనీసం మర్యాదపూర్వకంగా చైర్మన్ కలవపోవడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

అభివృద్ధిని విస్మరిస్తున్న చైర్మన్, ఈవో 

ఇటీవల కాలంలో కొందరు భక్తులు కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయాభివృద్ధికి విరాళాలు ఇచ్చారు. సుమారు రూ, 10 లక్షల విరాళాలపై చైర్మన్ సత్యనారాయణ రెడ్డి పాలకమండలికి లెక్క చెప్పలేదని ఆరోపణలు ఉన్నాయి. పాలక మండలి సభ్యులను సమన్వయం చేయడంలో చైర్మన్ విఫలమవుతున్నారు. సమావేశం నిర్వహించి, ఆలయాభివృద్ధిపై అభిప్రాయాలు సలహాలు తీసుకున్న దాఖలాలు లేవని కొందరు ధర్మకర్తలు వాపోతున్నారు.

గతంలో నిర్మించిన కల్యాణ మండపాన్ని వినియోగంలోకి తేలేకపోవడంతో వృథాగా ఉన్నది. ఆలయంలో భక్తుల కోసం సరైన వసతులు లేవు. మూత్రశాలలు, స్నానాల గదులు నిర్మించలేదు. రాత్రి వేళల్లో ఆలయంలో నిద్రించడానికి వస్తే విశ్రాంతి గదులు, సత్రం వంటి సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు భక్తులు ఆరుబయటే నిద్రిస్తున్నారు. ఆలయ భూముల పరిరక్షణలో సరైన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

ఆలయ కార్యనిర్వహణాధికారి సైతం విభజన రాజకీయాలు చేస్తున్నట్లు కొందరు ధర్మకర్తలు ఆరోపిస్తున్నారు. దాతలు ఇచ్చిన విరాళాలపై పాలక మండలితో చర్చించడం లేదని, అభివృద్ధి పనులను సైతం అనుకూలంగా ఉన్న ధర్మకర్తలకు ఇస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయాభివృద్ధిలో, భక్తులకు సరైన వసతులు కల్పించడంలో చైర్మన్ విఫలం కావడంతో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడానికి కొందరు ధర్మకర్తలు సిద్ధమవుతున్నారు.