మైనర్ బాలికకు న్యాయం చేయాలి.. బండి సంజయ్ రాజీనామా చేయాలి!
బండి భగీరథ పై నిస్పక్షపాతంగా విచారణ చేపట్టాలి
బండి సంజయ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి: ఎమ్మెల్యే కోవలక్ష్మి
మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో సంబంధం ఉన్న బండి సంజయ్ కుమారుడు కేసు తెలంగాణలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కేసులో బాధితురాలికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు.
ఆసిఫాబాద్(విజయ క్రాంతి): కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కుమారుడు బండి సాయి భగీరత్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు రాష్ట్రంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఎమ్మెల్యే కోవ లక్ష్మీ(MLA Kova Lakshmi) పేర్కొన్నారు. మంగళవారం తన నివాసం వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలి తల్లిదండ్రులు బషీర్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, మొదట పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా బెదిరింపులకు దిగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాల్సి వచ్చిందని తెలిపారు. బండి సాయి భగీరత్ తన పలుకుబడిని ఉపయోగించి బాధితురాలిపైనే డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేస్తోందంటూ ఎదురుదాడికి దిగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బాధితురాలి కుటుంబం ఆర్థికంగా స్థిరమైన, గౌరవప్రదమైన కుటుంబమని, రాజకీయ ప్రభావంతో కేసును మళ్లించే ప్రయత్నాలు చేయరాదని అన్నారు.
డ్రగ్స్, మద్యం సేవిస్తూ అసభ్యకర ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, ఇప్పటివరకు కఠిన చర్యలు తీసుకోకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలన్నారు. బేశరత్తుగా బండి సంజయ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బండి సాయి భగీరత్‌ను వెంటనే అరెస్ట్ చేసి, బాధిత మైనర్ బాలికకు పూర్తి రక్షణతో పాటు న్యాయం చేయాలని, ఈ వ్యవహారంలో ఎవరి ఒత్తిడికీ లోనుకాకుండా పోలీసులు పారదర్శకంగా విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు సరస్వతి, పోచయ్య, రవీందర్, శ్రీధర్ రెడ్డి, అహ్మద్, నిసర్, హైమద్, శ్యామ్, సలాం, నారాయణ, అన్సార్, సంజీవ్ , రవి తదితరులు పాల్గొన్నారు.






