ఖైదీలను జైలులో బంధించి ఉంచాల్సిన అవసరం లేదు: తెలంగాణ గవర్నర్
హైదరాబాద్: చంచల్‌గూడ జైలు ప్రాంగణంలో ఒక వినూత్నమైన ప్రజా అవగాహన కార్యక్రమం ప్రారంభమైంది. చంచల్ గూడ జైలులో మ్యూజియం, 'ఫీల్ ది జైల్' (Feel The Jail) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా, ప్రజలు ఇప్పుడు జైలు జీవితాన్ని ఒక పూర్తి రోజు పాటు ప్రత్యక్షంగా అనుభవించవచ్చు. తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా(Telangana Governor Shiv Pratap Shukla) చంచల్‌గూడలో ఏర్పాటు చేసిన కొత్త జైలు మ్యూజియం, ఇంటరాక్టివ్ ప్రిజన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను అధికారికంగా ప్రారంభించారు.
'Feel The Jail'లో పాల్గొనేవారు జైలు వాతావరణంలో 24 గంటలు గడపడానికి రూ. 500 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. నమోదు చేసుకున్న తర్వాత, సందర్శకులను సాధారణ ఖైదీల మాదిరిగానే పరిగణిస్తారు. వారికి జైలు దుస్తులు, ఉక్కు పళ్ళాలు, మగ్‌లు, సాధారణ ఖైదీలకు ఉండే తరహాలోనే ఒక గుర్తింపు సంఖ్యను కూడా కేటాయిస్తారు.
ఈ కార్యక్రమంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ... తెలంగాణ పోలీసులు జైళ్లలో చేపట్టిన సంస్కరణలు బాగున్నాయని గవర్నర్ కొనియాడారు. ఉత్తర్ ప్రదేశ్ మంత్రిగా ఉన్నప్పుడు తాను కూడా కొన్ని సంస్కరణలు చేపట్టానని గుర్తుచేసుకున్నారు. జైలుకు వచ్చి ఖైదీల్లో పరివర్తన తీసుకురావలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ఖైదీలు అంటే జైలులో పూర్తిగా బంధించి ఉంచాల్సిన అవసరం లేదని గవర్నర్ సూచించారు. ఖైదీలకు ఆహ్లాదకర వాతావరణం ఉన్నప్పుడే వారిలో మార్పు తీసుకురాగలం అన్నారు. ఓపెన్ జైలు విధానం కూడా మంచి ఫలితాలు ఇస్తోందని తెలంగాణ గవర్నర్ చెప్పారు.






