18 August, 2026 | 3:32 PM

కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగించాలి

18-08-2026 02:35 PM

అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్‌ఎస్‌ నిరసన

సత్తుపల్లి,(విజయక్రాంతి): కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ మాజి ఎమ్మెల్యే సండ్ర వేంకట వీరయ్య ఆధ్వర్యంలో మంగళవారం సత్తుపల్లిలో నిరసన చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పేద కుటుంబాలకు అందుతున్న వివాహ ఆర్థిక సాయాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతూ.. పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహానికి ఆర్థిక భరోసాగా నిలిచిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను నిర్వీర్యం చేయడం సరికాదన్నారు. వరంగల్‌ జిల్లాలో గిరిజన గ్రామాల పర్యటన సందర్భంగా పెళ్లి కోసం దాచిన నగదు అగ్నికి ఆహుతైన ఘటనతో చలించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. తొలుత రూ.50 వేలతో ప్రారంభమైన సాయం రూ.75 వేలకు, అనంతరం రూ.లక్షకు పెరిగిందని గుర్తుచేశారు.

పథకం నిలిచిపోయే పరిస్థితి ఏర్పడటానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. పథకాన్ని నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌ వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే కౌంటర్‌ దాఖలు చేసి పథకం కొనసాగింపునకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు అమలవుతున్నప్పుడు తెలంగాణలో ఎందుకు కొనసాగించరని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన తులం బంగారం హామీ ఏమైందని నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని విమర్శించారు.

రైతు బీమా అమలు చేయాలి

రైతు బీమా ప్రీమియంను ప్రభుత్వం సక్రమంగా చెల్లించి అర్హులైన రైతు కుటుంబాలకు బీమా ప్రయోజనం అందేలా చూడాలని డిమాండ్‌ చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేసే విధానాలను విడనాడి, రైతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని కోరారు.

సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి

కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేయడం కంటే సాగునీటి ప్రాజెక్టులను రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా వినియోగించాలని అన్నారు. సీతారామ ప్రాజెక్టు, రాజీవ్‌ లింక్‌ కెనాల్‌ పనులను వేగవంతం చేసి రైతులకు సాగునీరు అందించాలని కోరారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

ఎస్ఐఆర్ పై అప్రమత్తంగా ఉండాలి

 ఎస్ ఐ ఆర్. ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని బీఆర్‌ఎస్‌ నాయకులు సూచించారు. బి ఎల్ ఏ.ల ద్వారా ఓటర్ల జాబితాలను పరిశీలించాలని, అర్హులైన వారి పేర్లు తొలగిపోయినా, జాబితాలో పొరపాట్లు ఉన్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ప్రత్యేకంగా సత్తుపల్లి పట్టణంపై దృష్టి సారించి అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ప్రధాన డిమాండ్లు

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను కొనసాగించాలి. హైకోర్టులో తక్షణమే కౌంటర్‌ దాఖలు చేయాలి. రైతు బీమాను సక్రమంగా అమలు చేయాలి. సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలి. SIRలో అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలి.