13 August, 2026 | 2:11 AM

జస్టిస్ యశ్వంత్‌వర్మ దోషి

13-08-2026 12:56 AM

నోట్ల కట్టల కేసులో తేల్చిన ప్యానెల్  

న్యూఢిల్లీ, ఆగస్టు 12: నోట్ల కట్టల కేసులో మాజీ న్యాయమూర్తి యశ్వంత్ వర్మకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దోషి అని  లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేసిన ప్యానెల్ తన నివేదికలో స్పష్టం చేసింది. యశ్వంత్‌వర్మ స్పందనలో నిజాయితీ, పారదర్శకత, సంస్థాగత బాధ్యత లోపించాయని కమిటీ తేల్చి చెప్పింది. ఆయన అధికారిక నివాసంలో భారీగా కాలిపోయిన నగదు లభించిన కేసులో వర్మ వివరణ సంతృప్తికరంగా లేదని పేర్కొంది.

ఈ మేరకు బుధవా రం పార్లమెంటులో సమర్పించిన నివేదికలో ఆయన్ని దోషిగా తేల్చింది. 2025 మార్చి 14 రాత్రి జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పడానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి, అక్కడి ఒక స్టోర్ రూమ్‌లో భారీ మొత్తంలో కాలిపోయిన కరెన్సీ నోట్లు కనిపించినట్లు సమాచారం. న్యూఢిల్లీలోని 30, తుగ్లక్ క్రెసెంట్ వద్ద ఉన్న అధికారిక నివాసంలోని ఒక స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో రూ. 500 నోట్లు లభ్యమయ్యాయి.

ఆ నగదు అక్కడ ఉండటానికి గల కారణం, దాని మూ లం, యాజమాన్యం గురించి సదరు న్యాయమూర్తి సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేక పోయారని కమిటీ తన నివేదికలో పేర్కొం ది. ఆ నగదు లభ్యతపై ఆ తర్వాత జరిగిన విచారణను కూడా సదరు కమిటీ ప్రశ్నించింది. నగదు లభించిన తర్వాత దర్యాప్తులో ఆధారాలను సరిగ్గా భద్రపరచలేదని కమిటీ తప్పుబట్టింది. స్టోర్‌రూమ్‌ను చట్టబద్ధంగా సీల్ చేసి తనిఖీ చేయకముందే అక్కడి సిబ్బంది కదలికలతో కీలక ఆధారాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. అనంతరం నగదు కనిపించకుండా పోవడం లేదా అందుబాటులో లేకపోవడానికి కారణం కూడా స్పష్టంగా తెలియలేదని తెలిపింది.