31 August, 2026 | 1:31 PM

ఆదివాసి యువతి శిరీష కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలి

31-08-2026 09:21 AM

ములకలపల్లి,ఆగస్టు 30 (విజయక్రాంతి): హైదరాబాద్ తుక్కుగూడలో ఘోర హత్యకు గురైన ఆదివాసి యువతి, నర్సు ఊకే శిరీష కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఐ పార్టీ ములకలపల్లి మండల సహాయ కార్యదర్శి నరాటి రమేష్ డిమాండ్ చేశారు. ఆదివాసి బిడ్డపై జరిగిన ఈ అమానుష ఘటనపై సీపీఐ కార్యాలయంలో ఆదివారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నరాటి రమేష్ మాట్లాడుతూ.. ములకలపల్లి మండలం చౌటిగూడెం కాలనీకి చెందిన ఊకే శిరీష హైదరాబాద్ తుక్కుగూడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా సేవలందిస్తోందని తెలిపారు. ప్రైవేట్  ఆసుపత్రిలోని నర్సుల క్వార్టర్స్ లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో రౌడీ మూకలు అఘాయిత్యానికి పాల్పడి, తీవ్రంగా గాయపరిచి చంపడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు.

దేశంలో, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని,ఈ పరిస్థితి చూసి సభ్య సమాజం తలదించుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం రూ.1 కోటి ఎక్స్గ్రేషియా తక్షణమే ప్రకటించాలని, బాధితురాలి కుటుంబంలో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి దోషులకు ఉరిశిక్ష విధించాలని ప్రభుత్వం స్పందించి శిరీష కుటుంబానికి న్యాయం చేయకపోతే, రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని నరాటి రమేష్ హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని "జస్టిస్ ఫర్ శిరీష" అంటూ నినాదాలు చేశారు