31 August, 2026 | 2:04 PM

దళితులను అవమానపరిస్తే చూస్తూ ఊరుకోం

31-08-2026 01:12 PM

కరీంనగర్ క్రైమ్ ఆగస్ట్31(విజయక్రాంతి):  ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే  ఉత్తరాఖండ్ లోని రామ్ లీలా మైదానంలో సభను నిర్వహించిన తర్వాత బిజెపి ఆర్ఎస్ఎస్ మతోన్మాదులు ఆ సభా స్థలాన్ని శుద్ధికరణ పేరుతో గంగాజలంతో గోమూత్రంతో శుద్ధిచేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. టి.పి.సి.సి ఎస్ సి సెల్ రాష్ట్ర అధ్యక్షులు, మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ  ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ పక్షాన ఉత్తరాఖండ్ హల్ద్వానీ లో మల్లికార్జున ఖర్గే జరిగిన అవమానాన్ని ఖండిస్తూ బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఆక్ట్ కేసు నమోదు చేయాలని ఆయన స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన పత్రిక విలేకరులతో మాట్లాడుతూ ఈ దేశంలో దళితులు హిందువులు కాదా, గడప లోపల కులం గడప దాటితే హిందువులం అని నినాదాలు పలికే బీజేపీ నాయకులకు దళితులు హిందువులుగా కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ బిజెపి మతోన్మాదులు చేసిన ఈ శుద్ధీకరణ కార్యక్రమం పై కరీంనగర్ ఎంపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించాలని ఆయన సవాలు విసిరారు. ఇది కేవలం మల్లికార్జున ఖర్గే  జరిగిన అవమానం మాత్రమే కాదని యావత్ దళిత జాతికి జరిగిన అవమానంగా భావిస్తున్నామని ఆయన అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, బిజెపి నాయకులు ఏ ముఖం పెట్టుకొని దళితుల ఓట్లు అడుగుతారో సమాధానం చెప్పాలి అని ఆయన ప్రశ్నించారు. హల్ద్వానీ ఘటన బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రాబోయే రోజుల్లో బిజెపి నాయకుల ఇండ్లు ముట్టడించి వారిని రోడ్లపై తిరగకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు.

హిందువులంతా బంధువులే అని హితవు పలికే బండి సంజయ్ కి హల్ద్వానీ ఘటన కనిపించడం లేదా అని ఆయన ఎద్దేవా చేశారు. ఇకనైనా కులాల పేరిట మతాల పేరిట రాజకీయాలు మానుకోవాలని లేకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యంగా దళితుల జోలికొస్తే చూస్తూ ఊరుకోమని దళితులను అవమానపరిస్తే దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని ఆయన గుర్తు చేశారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు తాజుద్దీన్, ఎస్టీ సెల్ అధ్యక్షులు శ్రావణ్ నాయక్, మాజీ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్, దళిత కాంగ్రెస్ నాయకులు వెన్న రాజమల్లయ్య, సముద్రాల లక్ష్మణ్, మాతంగి అనిల్, జీడి రమేష్, మీసాల సాయిలు, దుబ్బాసి కుమార్, హస్త పురం రమేష్, ధ్యావ ప్రభాకర్, కనకం విద్యాసాగర్, గొట్టే బాబు ప్రణవ్,అరుణ్, పిల్లి అశోక్, వేల్పుల అనూష తదితరులు పాల్గొన్నారు