calender_icon.png 15 February, 2026 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తారిఖ్‌కు జూలై చార్టర్ సవాల్

15-02-2026 12:00:00 AM

180 రోజుల్లోపు సంస్కరణలు అమలు చేసి తీరాల్సిందే..

లేదంటే.. ఉద్యమిస్తామంటూ ఇప్పటికే విపక్షాల అల్టిమేటం

ఢాకా, ఫిబ్రవరి 14: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో బీఎన్పీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈనెలలోనే ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు తారిఖ్ రెహమాన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ‘ఇల్లు అలకగానే పండగా కాదన్నట్లు..’ ప్రధానిగా తారిఖ్ పగ్గాలు చేపట్టగానే, ఆయన ముందుండే మొట్టమొదటి సవాల్ ‘జూలై చార్టర్’. కొత్త ప్రభుత్వం ముందు ఇచ్చిన హామీ మేరకు 180 రోజుల్లో సంస్కరణలు అమలు చేయాల్సి ఉంటుంది.

ఈ సంస్కరణలు ఏర్పాటు చేయాలా? వద్దా? అన్న అంశంపై అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ఈనెల 12 పోలింగ్‌తో పాటు ‘జూలై చార్టర్’పై ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రజాభిప్రాయ సేకరణలో 60 శాతం మంది ఓటర్లు కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం కచ్చితంగా సంస్కరణలు అమలు చేయాల్సిందే.. అనే అభిప్రాయం వ్యక్తంచేశారు.

ఏం చేయాల్సి ఉంది..?

జూలై చార్టర్ ప్రకారం కొత్త ప్రభుతత్వం రాజ్యాంగంలో భారీ మార్పులు చేయాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి పదవీకాలంపై పరిమితి, ద్విసభా విధానం, న్యాయవ్యవస్థకు స్వయం ప్రతిపత్తి వంటి 80కి పైగా సంస్కరణలను కేవలం 180 రోజుల్లో అమలు చేయాల్సి ఉంటుంది. అయితే.. సార్వత్రిక ఎన్నికల్లో రెండు వంతుల మెజారిటీ సాధించి, అధికారంలోకి వస్తున్న బీఎన్పీ నేతలకు.. ఈ చార్టర్‌పై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. చార్టర్‌లో ప్రధానికి ఉండే కీలకమైన అధికారాలను తగ్గించడం, ఎగువ సభ ఏర్పాటుకు ఆ పార్టీ నేతలు విముఖంగా ఉన్నారు.

మరోవైపు సంస్కరణల అమలు విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేస్తే సహించేది లేదని జమాత్ -ఇస్లామీ చీఫ్, ప్రతిపక్ష నేత షఫీకర్ రెహమాన్ ఇప్పటికే హెచ్చరించారు. 2024 ఉద్యమ ఆకాంక్షలను కాలరాస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు.

సంస్కరణలు అమలు చేయకపోతే యువత, విద్యార్థి సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని సార్వత్రిక ఎన్నికల్లో ఆరు స్థానాలు సాధించిన నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్సీపీ) సైతం హెచ్చరిస్తున్నది. ప్రభుత్వం కాలయాపన చేస్తే విద్యార్థులు మళ్లీ రోడ్ల మీదకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రధాని తారిఖ్ రెహమాన్ చార్టర్ సంస్కరణలను ఎలా అమలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.