చెట్లపొదల్లోకి దూసుకెళ్లిన జీపు
తప్పిన పెను ప్రమాదం, పలువురికి గాయాలు
అచ్చంపేట జూన్ 23: ప్రయాణికులతో ఘాట్ రోడ్లో ప్రయాణిస్తున్న జీపు అకస్మాత్తుగా చెట్లపొదల్లోకి దూసుకెల్లడంతో బోల్తా పడిన ఘటనలో పలువురు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ నుంచి ప్రయాణికులతో వస్తున్న జీపు మన్ననూరు దాటగానే ఘాట్ రోడ్డు సమీపంలోని చెట్లపొదల్లోకి దూసుకెళ్ళింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
వారిని అచ్చంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో జీపులో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఉన్నారు. జీపు స్టీరింగ్ కంట్రోల్ కాకపోవడంతో చెట్లలోకి దూసుకెళ్లినట్లుగా ప్రయాణికులు చెబుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని డీఎస్పీ శ్రీనివాసులు, అచ్చంపేట ఎస్త్స్ర సద్దాం పరామర్శించి ఘటనకు దారితీసిన వివరాలను నమోదు చేసుకున్నారు.






