24 June, 2026 | 3:38 AM

తాడ్వాయిలో ఉద్రిక్తత

24-06-2026 02:11 AM
  1. యూరియా యాప్‌ను ఎత్తివేయాలని ధర్నాకు బీఆర్‌ఎస్ పిలుపు
  2. పెట్రోల్ బాటిళ్లతో రోడ్డు పైకి వచ్చిన నేతలు
  3. ఒక్కసారిగా దూసుకొచ్చిన -మాజీ ఎమ్మెల్యే సురేందర్ 
  4. అరెస్టు చేసిన పోలీసులు
  5. రైతుల సమస్యలపై పోరాడితే గృహ నిర్బంధాలా: కేటీఆర్
  6. హౌస్ అరెస్టులను ఖండిస్తున్నాం: హరీశ్‌రావు

తాడ్వాయి, జూన్ 23 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూరియా యాప్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ తాడ్వాయి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ నాయకులు ధర్నాకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఎల్లారెడ్డి, కామారెడ్డి రోడ్డుపై పెద్ద సంఖ్యలో మోహరించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ పంపించారు. అనుమానితులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.

అంతేకాకుండా మంగళవారం తెల్లవారుజాము 3 గంటల నుంచే బీఆర్‌ఎస్ పార్టీ నాయకులను అరెస్టు చేసి దోమకొండ, కామారెడ్డి, గాంధారి, తాడ్వాయి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలోనే ఉదయం తాడ్వాయిలోని ఎల్లారెడిొో్డకామారెడ్డి రోడ్డు పాత బస్టాండ్ వద్ద తాడ్వాయి సింగిల్ విండో చైర్మన్ నల్లవెల్లి కపిల్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నర్సింలు పెట్రోల్ డబ్బాలతో వచ్చి నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇద్దరి వద్ద ఉన్న పెట్రోల్ డబ్బాలు లాక్కొని వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

పెట్రోల్ డబ్బాల మూతలు తెరుచుకోవడంతో పోలీసులపై, నాయకులపై పడింది. ఆ తర్వాత ఒక్కసారిగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఎల్లారెడ్డి కామారెడ్డి రోడ్డుపైకి వచ్చి యూరియా యాప్‌ను ఎత్తివేయాలంటూ నినాదాలు చేశారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే సురేందర్‌ను అరెస్టు చేసి జీపులోకి ఎక్కించారు. వారితో పాటు పలువురు నాయకులను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి జీపుల్లో స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతూ.. పోలీసులు అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే యూరియా యాప్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలపడం కోసం వస్తే పోలీసులు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అరెస్టులు చేసినా తమ నిరసనను ఆపలేరని హెచ్చరించారు. కాగా ధర్నాలో పాల్గొనకుండా మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డిని హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు.

ప్రభుత్వ నిరంకుశ వైఖరి: కేటీఆర్

రైతులకు ఎరువుల సరఫరాలో ఏర్పడిన తీవ్ర సమస్యలను ఎత్తిచూపుతూ, యూరియా పంపిణీలో అమలు చేస్తున్న లోపభూయిష్టమైన యాప్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తాడ్వాయిలో జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమైన మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిని గృహ నిర్బంధం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణికి నిదర్శనమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు.

ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్, రైతుల తరఫున ప్రశ్నించే నాయకులను అణిచివేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు. వ్యవసాయానికి అత్యవసరమైన యూరియా అందక రైతులు ఆందోళన చెందుతుంటే, వారి సమస్యలను వినాల్సిన ప్రభుత్వం పోలీసు నిర్బంధాలతో స్పందించడం సిగ్గుచేటన్నారు.

హౌస్ అరెస్టులు తగదు: హరీశ్‌రావు

రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న ‘యూరియా యాప్’ను వెంటనే రద్దు చేయాలనే డిమాండ్‌తో తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లకుండా మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిని, అలాగే బీఆర్‌ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు -మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. రైతులకు యూరియా సరఫరా చేయడంలో పూర్తిగా చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, తన నిరంకుశ విధానాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూడడం అత్యంత అవివేకమని అభిప్రాయపడ్డారు.