24 June, 2026 | 3:16 AM

మెట్రో-2కు రైట్ రైట్!

24-06-2026 01:55 AM
  1. రెండో దశ పనులకు గ్రీన్‌సిగ్నల్ 
  2. ఫేజ్--1 వాల్యూయేషన్, స్వాధీనానికి కూడా.. 
  3. కేంద్ర, రాష్ట్రాల మధ్య చర్చలు సఫలం
  4. కన్సల్టెంట్‌గా ఎస్‌బీఐ క్యాప్స్ 
  5. ప్రక్రియ వేగవంతానికి సమన్వయ కమిటీ 
  6. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రుల సంయుక్త  సమావేశంలో నిర్ణయం

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి) : గ్రేటర్ హైదరాబాద్ మెట్రో రైల్ భవిష్యత్‌కు సంబంధించి అత్యంత కీలకమైన అడుగుపడింది. మెట్రో-1ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, అలాగే ఫేజ్-2 విస్తరణ పనులకు  అధికారికంగా గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులతో జరిపిన వరుస చర్చ లు సఫలమయ్యాయి. తొలుత సోమవారం రాత్రి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి సీఎం రేవంత్ కలిశారు.

సుదీర్భంగా జరిగిన ఈ సమావేశంలో మెట్రో-1 స్వాధీనం, ఫేజ్-2కు అనుమతులపై చర్చించారు. మంగళవారం కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ నివాసంలో భేటీ అయ్యారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మెట్రో ఫేజ్- -1 వాల్యూయేషన్, స్వాధీనానికి రుణ సేకరణ, రుణమంజూరీ సంస్థ, ఫేజ్- -2 విస్తర ణ, వ్యయం, రుణం తదితర అంశాలపై  చర్చించారు.

వీటిపై అధ్యయనం చేసేందు కు కన్సల్టెంట్‌ను నియమించాలని కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి ఏకాభిప్రాయానికి వచ్చారు. కన్సల్టెంట్‌గా ఎస్‌బీఐసీఏపీ ఎస్ (ఎస్‌బీఐ క్యాప్స్) సంస్థను ఎంపిక చేశారు. ఆయా అంశాలపై అధ్యయనం చేసి సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ చేపట్టనున్నారు.

కన్సల్టెం ట్ అధ్యయన సమయంలో సమన్వయం కోసం ప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్రం తరఫున  పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్య దర్శి ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ ఇద్దరు అధికారులు సమన్వ యం చేసుకుంటూ ప్రక్రియ వేగంగా సాగేందుకు కృషి చేస్తారు.

సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా..

మెట్రో ఫేజ్-1 ఆస్తుల విలువ ఎంత, ప్రభుత్వం దానిని ఎలా టేకోవర్ చేసుకోవాలి?, ఫేజ్-2 విస్తరణకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తక్కువ వడ్డీకి రుణం ఎలా పొందాలి? తదితర విషయాలపై ఎస్‌బీఐ క్యాప్స్ సమగ్ర నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక ఆధారంగానే కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిధుల విడుదలకు అనుమతి ఇవ్వనుంది. 

70 కిలోమీటర్ల మేర కొత్త మార్గాలు

కేంద్ర మంత్రులు, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య జరిగిన చర్చల్లో భాగంగా మెట్రో ఫేజ్-2ను దాదాపు 70 కిలో మీటర్లకు పైగా విస్తరించనున్నారని, కొత్త మార్గాలను ప్రతిపాదించిటనట్లు తెలుస్తోంది. మెట్రో రెండో దశ పనులు పూర్తయితే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాకుండా, ప్రజారవాణా వ్యవస్థలో మైలురాయిగా నిలవనుంది.

‘రేవంత్ అడిగారు.. మీటింగ్‌లు ఏర్పాటు చేశా’

  • రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటాం.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): ఢిల్లీ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మంగళవారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీకోసం సీఎం రేవంత్‌రెడ్డి రెండు సార్లు నాకు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఇద్దరు కేంద్రమంత్రు లతో సమావేశాల కోసం చొరవ తీసుకున్నా. ఇద్దరం కలిసి  రెండు రోజుల్లో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ఖట్టర్‌తో సమావేశం అయ్యాం.   

రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటా’ అని కిషన్‌రెడ్డి ఎక్స్‌లో పేర్కొన్నారు.  ఇదిలా ఉండగా కాంగ్రెస్ హామీలను నెరవేర్చకపోవడంపై వినతిపత్రం ఇచ్చేందుకు ఏఐసీసీ అగ్ర నేత రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్ ఇప్పించాలని బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు ఇటీవల సీఎంకు లేఖ రాశారు. వీరిద్దరి భేటీ ఎప్పుడు జరగనుందోనని.. రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.