19 March, 2026 | 2:13 AM

కోయగూడెం ఓసీలో మాయమవుతున్న జామాయిల్ కలప

19-03-2026 12:12 AM
  1. కాలుష్య నివారణకు వేసిన మొక్కలు.. కనికరం లేకుండా నరికివేత 

రూ. లక్షల విలువైన జామాయిల్ కలప మాయమైన వైనం 

టేకులపల్లి,మార్చి 18 (విజయక్రాంతి):టేకులపల్లి మండలం సింగరేణి కోయగూడెం ఓసీ ద్వారా ప్రభావిత గ్రామాలు కాలుష్యం బారిన పడకుండా సింగరేణి యాజమాన్యం మొక్కలు నాటి సంరక్షించేందుకు రూ.కోట్లు వెచ్చిస్తోంది. ఇందులో భాగంగా రెండు దశాబ్దాల క్రితం మూతబడిన సెంట్రల్ ఫిట్, వెస్ట్రన్ ఫిట్, కేఓసీ - 2  గనుల ఓబీ గుట్టలపై నాలుగు కిలోమీటర్ల పరిధిలోని 70 ఎకరాల్లో జామాయిల్ మొక్కలతో పాటు ఇతర మొక్కలు నాటారు.

ప్రస్తుతం ఏపుగా ఎదిగిన ఒక్కో చెట్టు సుమారు టన్ను బరువు  ఉంటుంది. ఈ వృక్షాలను కాపాడాల్సిన కేఓసీ యాజమాన్యం, పర్యావరణ విభాగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తద్వారా జామాయిల్ చెట్లు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. కోయగూడెం ఓసీ పరిధిలోని ఓబీ గుట్టలపై హెక్టారుకు 1,000 చొప్పున జామాయిల్ మొక్కలను అప్పట్లో నాటారు.

మొత్తమ్మీద సుమారు 28వేల వృక్షాలు ఉండాలి. అయితే విడతల వారీగా వాటిని కొందరు దుండగులు నరికేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రికి రాత్రే మిషన్లతో నరికి ట్రాక్టర్ల  ద్వారా సమీప డిపోలకు తరలించి విక్రయిస్తున్నారు. ఒక ట్రాక్టర్ లోడ్ విలువ సుమారు రూ.2లక్షలు ఉంటుందని సమాచారం. అక్రమార్కులు ఒకే దగ్గర వృక్షాలను తొలగించకుండా అక్కడక్కడ కొన్నింటిని నరికేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా చాకచక్యత ప్రదర్శిస్తున్నారు. ఏపుగా ఎదిగిన జామాయిల్ చెట్లను  అటవీశాఖకు కేఓసీ అప్పగిస్తే ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరేది.

పైగా ఈ వృక్షాలను రక్షించటంలో సింగరేణి విఫలమవటంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 9న జామాయిల్ వృక్షాలు నరుకుతున్నట్లుగా సమాచారం అందటంతో సింగరేణి  సర్వీసెస్ అండ్ ప్రొటెక్షన్ కార్ప్ (ఎస్‌అండ్పీసీ) సిబ్బంది అక్కడికి వెళ్లారు. కొందరు వ్యక్తులు తారసపడ్డారు.

ద్విచక్రవాహనం, మద్యం బాటిళ్లు, గొడ్డలి, రంపం వదిలి దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. సింగరేణి సంస్థ నాటిన జామాయిల్ మొక్కలు వృక్షాలుగా ఎదిగాయి. వీటిని అక్రమార్కులు నరికేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ఇల్లెందు ఏరియా అధికారులు అంటున్నారు.