విధులకు హాజరు కాని కార్యదర్శి… చర్యలు కోరుతున్న గ్రామస్తులు
చివ్వెంల,(విజయక్రాంతి): మండలంలోని పిల్లలజగ్గుతండ గ్రామ పంచాయతీలో కార్యదర్శి విధులకు హాజరు కాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి పెరుమళ్ళ అంజయ్య తన విధులను సక్రమంగా నిర్వహించకపోవడంతో కార్యాలయంలో జరగాల్సిన పనులు నిలిచిపోయాయని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామస్తుల వివరాల ప్రకారం, కార్యదర్శి ప్రతి పది రోజులకు ఒకసారి మాత్రమే కార్యాలయానికి వచ్చి హాజరు పట్టికలో సంతకం చేసి వెళ్లిపోతున్నారని తెలిపారు. దీంతో పలు ప్రభుత్వ సేవలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఈ విషయంపై జిల్లా పంచాయతీ అధికారికి, ఎంపీడీఓకు గ్రామస్తులు ఫిర్యాదు చేసి, గ్రామంలో విచారణ జరిపి సంబంధిత అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.




