17 March, 2026 | 3:48 AM

ప్రజలకు అందుబాటులో ఉండాలి

17-03-2026 01:05 AM
  1. సమయపాలన పాటించాలి.. సమస్యలు పరిష్కరించాలి

అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

మంచిర్యాల, మార్చి 16 (విజయక్రాంతి) : జిల్లా, మండల స్థాయి అధికారులు ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు వారికి అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. సోమ వారం ప్రజావాణి కార్యక్రమంలో అర్జీలు స్వీకరించిన అనంతరం జిల్లా అధికారులతో ఆయన మాట్లాడారు. అధికారులు ప్రతి రోజు వారి కార్యాలయంలో కనీసం రెండు గంటలు ప్రజా సమస్యలు వినడం, వాటి పరిష్కారం కోసం కేటాయించాలన్నారు.

సమయపాలన పాటించకుండా, కార్యాలయాలకు రాకుండా ఫీల్ లో ఉంటున్నామంటూ విధుల దుర్వినియోగానికి పాల్ప డవద్దని, కార్యాలయంలో ఎలాంటి ఫెండింగ్ ఫైళ్లు లేకుండా, ప్రజా సమస్యలు పరిష్కరించాలని సూచించారు.

చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం ప్రజలు గ్రామ, పట్టణ, మండలాల నుంచి జిల్లా కేంద్రానికి వస్తున్నారంటే అక్కడి అధికారులు నిర్లక్ష్యమే కారణ మవుతుందని, సాధ్యమైనంత  వరకు వారి స్థాయిలోనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చొరవచూపాలని, అలా జరిగేలా ఆయా శాఖల జిల్లా అధికారులు మండల అధికారుల పని తీరుపై పర్యవేక్షించాలన్నారు. జిమరి అధికారులు ఏ స్థాయిలో ఆచరణలో పెడుతారో వేచి చూడాల్సిందే..

నాణ్యమైన విద్య బోధన అందించాలి 

ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. పట్టణంలోని రాజీవ్ నగర్ లోని మోడల్ స్కూల్ ను సోమవారం సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న మధ్యాహ్న భోజనం, ఆహారం నాణ్యత, తరగతి గదులు, పరిసరాలను కళాశాల ప్రిన్సిపాల్ ముత్యం బుచ్చన్న తో కలిసి పరిశీలించారు.  

హాజీపూర్ మండలంలో...

హాజీపూర్ మండలం గుడిపేట, చందనాపూర్ లో గల పట్టణ ఆవాస పాఠశాలను కలెక్టర్ కుమార్ దీపక్ సోమ వారం సందర్శించి పాఠశాలలో చేపట్టిన అదనపు గదులు, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని కోరారు. వంటశాలను సందర్శించి విద్యార్థుల ఆహారం తయారీలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులను వినియోగించాలని, ఆహారం తయారీ సమయంలో సిబ్బంది శుభ్రత నిబంధనలు పాటిం చాలని సూచించారు. ఆయన వెంట సంబంధిత అధికారులు తదితరులున్నారు.