5 August, 2026 | 1:12 AM

కాంగ్రెస్‌వే క్షుద్ర రాజకీయాలు

05-08-2026 12:04 AM
  1. హరీశ్‌పై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు నిరాధారం
  2. హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే   
  3. వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
  4. బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

హైదరాబాద్, ఆగష్టు 4 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కనబెట్టి క్షుద్ర రాజకీయాలకు తెరలేపిందని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. హరీశ్‌రావుపై కాంగ్రెస్ నేతల ఆరోపణలు నిరాధారమైనవని, హిందూ సమాజాన్ని అవమానించడమే నని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవా రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ యన మాట్లాడారు.

1,300 మంది అమరవీరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన పవిత్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ నేతలు బాధ్యతారాహిత్య మైన వ్యాఖ్యలతో అపవిత్రం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో శాస్త్రీయ దృక్పథంతో చర్చలు జరగాలని, కానీ కాంగ్రెస్ నేతలు క్షుద్ర రాజకీయాలకు తెరలేపి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హరీశ్‌రావు పై కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్‌రెడ్డి, మహేష్‌కుమార్‌గౌడ్ చేసిన వ్యా ఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు.

తాను శివభక్తుడినని, దేవాలయాలకు వెళ్లి పూజలు చేయడం ప్రతి పౌరుడికి రాజ్యాం గం కల్పించిన హక్కు అని ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. హరీశ్‌రావు తనకు నచ్చిన ఆలయాలకు వెళ్ల డం ఆయన వ్యక్తిగతమని, దానిపై కాంగ్రెస్ నేతలు అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, మేడారం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులందరూ క్షుద్రపూజల కోసమే వెళ్తున్నారని కాంగ్రెస్ భావిస్తుందా? అని ప్రశ్నించారు. హరీశ్‌రావు ఎక్కడికి వెళ్లారని వివరాలు సేకరించే హక్కు మహేష్‌కుమార్‌గౌడ్‌కు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు.  

మూఢనమ్మకాలపై రాజకీయమా?  

కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్‌ను ‘గ్రహాచార భవన్‘గా మార్చారని, ప్రజా సమస్యలను పక్కనపెట్టి మూఢనమ్మకాలపై రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.  హిందూ సమాజానికి బహిరంగ క్షమా పణ చెప్పాలని, హరీశ్‌రావు పంపిన లీగల్ నోటీసులకు  సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హిందూ ధర్మ రక్షకులమని చెప్పుకునే బీజేపీ.. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ఎందుకు మౌనం వహిస్తుందన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకే కాంగ్రెస్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ రోపించారు. ప్రజా సమస్యలను దాచిపెట్టేందుకే క్షు ద్రపూజల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఇటువంటి రాజకీ యాలను విశ్వసించరని పేర్కొన్నారు.

పీసీసీ చీఫ్‌కు హరీశ్‌రావు లీగల్ నోటీసులు

క్షుద్ర పూజలు చేశారంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు లీగల్ నోటీసులు పంపించారు. మీడియా, సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మహేష్‌కుమార్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే సివిల్, క్రిమినల్, పరువు నష్టం కేసులు వేస్తామని స్పష్టం చేశారు.