రాష్ట్రంలో రానున్నది బీజేపీ సర్కారే
- మోదీ ప్రభుత్వ తీరుపై ప్రజలకు ఎనలేని విశ్వాసం
- మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు
మానకొండూరు, మే 31 (విజయక్రాంతి): స్వావలంబన, స్వాభిమానందిశగా ఆలోచనలు జరగాలని, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు కొనసాగాలని బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఆదివారం బీజేపీ శిక్షణ తరగతుల (సమరోప్) ముగింపు కార్యక్రమానికి హాజరై ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ను ప్రోత్సహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పారని, నేడు ఆ దిశగా ఆయన ఆలోచన చేయడం లేదన్నారు. యువతను ఆదుకోవడానికి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి మండలానికి ఒక స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్రంలో జీఎంఆర్ లాంటి సంస్థ మూడు ప్రాంతాల్లో స్వచ్ఛందంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను నడిపిస్తుందని, దీనివల్ల చాలా మంది ఉపాధి పొందుతున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగావరంగల్ లో ఏర్పాటు చేయబోయే టెక్స్ టైల్ పార్కు ఎంతో చరిత్ర ఉందని తెలిపారు.లండన్ లోని హైడ్ పార్క్ లో జరిగిన ఒక ఎగ్జిబిషన్ లో వరంగల్ కి చెందిన చేనేత దుప్పటి ప్రథమ బహుమతి సాధించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
తెలుగు భాషకు ప్రాధాన్యత ఇచ్చి, భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.యునెస్కో వారి ఆదేశాలతో ఫిబ్రవరి 21న అంతర్జాతీయ భాష దినోత్సవం నిర్వహించుకుంటున్నామన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వేములవాడలో పంపకవి జన్మించారని, ఆయన్ని తెలుగుకు ఆదికవిగా భావించుకుంటున్నమని తెలిపారు. అలాంటి గొప్పనైన పంపకవి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఆవిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మేయర్ కోలగని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మాజీ జిల్లా అధ్యక్షులు భాష సత్యనారాయణ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు గుర్రాల వెంకటరెడ్డి, మేకల ప్రభాకర్ యాదవ్, బొంతల కళ్యాణ్ చంద్ర, కార్పొరేటర్ రవీందర్ , తిమ్మాపూర్ మండల అధ్యక్షులు చింతం శ్రీనివాస్, బీజేవైఎం అధ్యక్షులు గడ్డం అరుణ్, రామిడి మహేందర్, జక్కోజు అనిల్, ఓదెలు, అప్పల శ్రీనివాస్, దూలం కిరణ్ తదితరులు పాల్గొన్నారు.






