క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా వర్తించదు!
- మునుపటి తీర్పు రికార్డుల్లో ఎలాంటి లోపాలు లేవు
- తీర్పుపై ఎలాంటి పునః సమీక్ష అవసరం లేదు
- మరోసారి తేల్చిచెప్పిన అత్యున్నత న్యాయస్థానం
- పాస్టర్ ఆనంద్ రివ్యూ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ, జూలై ౧౮: క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా వర్తించదని, పిటిషనర్ చింతాడ ఆనంద్ క్రైస్తవ మతా న్ని స్వీకరించినందున ఆయనకు ఎస్సీ హోదా వర్తించదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తమ మునుపటి తీర్పులో మార్పులు అవసరం లేదని, దానిలో ఎలాంటి లోపాలు లేవని తెలిపింది. ఇక తీర్పుపై పునఃసమీక్ష అవసరం లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు పిటిషనర్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కొట్టవేసింది.
క్రైస్తవ మతాన్ని స్వీకరించడంతో పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ హోదాను మార్చి ౨౪న ఆ రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. దీంతో పిటిషనర్ ఆ తీర్పును పునః పరిశీలించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై శనివారం జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పాత తీర్పు రికార్డుల్లో ఎలాంటి లోపాలు లేవని స్పష్టం చేసింది. ఈ కేసులో బహిరంగ కోర్టు విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది.
అంతేకాదు.. ఇదే అంశానికి సంబంధించి ఈనెల ౧౫ వరకు సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లన్నింటినీ మూసివేసింది. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వ్యక్తులు కేవలం తమ పాత కుల మూలాల ఆధారంగా ఎస్సీ హోదాను క్లెయిమ్ చేయలేరని సుప్రీంకోర్టు మునుపటి తీర్పులో స్పష్టం చేసింది. ఈ రివ్యూ పిటిషన్ తిరస్కరణతో న్యాయపరంగా ఒక స్పష్టత వచ్చింది. క్రైస్తవ మతాన్ని పాటిస్తూ ఎస్సీ సర్టిఫికెట్ ద్వారా ప్రయోజనాలు పొందడం సాధ్యం కాదని తేలింది.
అట్రాసిటీ కేసు నేపథ్యం
ఏపీలోని బాపట్ల జిల్లా కొత్తపాలేనికి చెందిన చింతాడ ఆనంద్ తనను ఇదే గ్రామానికి అక్కల రామిరెడ్డితోపాటు మరో ఐదుగురు బంధువులు, కుటుంబసభ్యులు కులం పేరుతో దూషించారని ౨౦౨౧ జనవరిలో చందోలు పోలీసులను ఆశ్రయించారు. నాడు పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
దీంతో రామిరెడ్డి న్యాయపోరాటానికి దిగాడు. ఆనంద్ ఒక క్రైస్తవ మత బోధకుడని, ఆ విషయం తాను ఇచ్చిన ఫిర్యాదులోనూ పేర్కొన్నాడని, క్రైస్తవ మతంలోకి మారితే, ఏ వ్యక్తికైనా ఎస్సీ హోదా వర్తించదని, కాబట్టి తమపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా చెల్లదని ఏపీ హైకోర్టులో వాదించాడు.
దీంతో హైకోర్టు ఆ అట్రాసిటీ కేసును గతేడాది కొట్టివేసింది. ఈ ఏడాది మార్చి 24న అత్యున్నత న్యాయస్థానం కూడా ఆ తీర్పును సమర్థించింది. ఈ కేసుకు సంబంధించి కోర్టులు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా పాస్టర్ ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దుకు సంబంధించిన ప్రక్రియను బాపట్ల జిల్లా రెవెన్యూ యంత్రాంగం ప్రారంభించింది.






