గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఎంపీడీఓ కు వినతి పత్రం
దమ్మపేట,(విజయక్రాంతి): గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు ఆధ్వర్యంలో శుక్రవారం ఎంపీడీఓ రవీంద్రారెడ్డికి పంచాయతీ కార్మికులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మురహరి రఘు మాట్లాడుతూ లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 10న జైలు భరో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్లను అమలు చేస్తుందని విమర్శించారు. గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు విజయలక్ష్మ, యశోద, మల్లేశ్వరి, భవాని, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.






