గ్రామసభలతో క్షేత్రస్థాయి సమస్యల గుర్తింపు
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) జూన్ 8 (విజయక్రాంతి): గ్రామాల్లో ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిష్కరించేందుకు గ్రామ సభలు సమర్థవంతమైన వేదికగా నిలుస్తాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
సోమవారం మల్హర్ మండలం రుద్రారం గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ రాహు ల్ శర్మ సంబంధిత శాఖల అధికారులతో క లిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 4, 6, 8, 10 తేదీలలో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ప్రతి గ్రామ సభలో వివిధ శాఖల అధికారులు తమ శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రజలకు అందుబాటులో ఉన్న సేవలపై అవగాహన కల్పిస్తు న్నట్లు పేర్కొన్నారు. గ్రామసభల ద్వారా గ్రామస్థుల సమస్యలను నేరుగా తెలుసుకొని త్వరితగతిన పరిష్కరించే అవకాశం కలుగుతుందని అన్నారు. ఎస్.ఐ.ఆర్ నమో దు ప్రక్రియ, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు పంటల సేద్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పారిశుధ్యం, కాలుష్య నియంత్రణ, సురక్షిత తాగునీటి నిర్వహణ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
రుద్రారం గ్రామ సభలో రైతులు పట్టాదారు పాసుపుస్తకాలకు సంబంధించిన సమస్యలు, రహదారులు, డ్రైనేజీ తదితర అంశాలపై వినతిపత్రాలు సమర్పించారని చెప్పారు. అందిన వినతులను సంబంధిత అధికారుల ద్వారా వెంటనే పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు, ఆర్డీఓ రవీందర్, తహసీల్దార్ రవికుమార్, సీడీపీఓ రాధిక తదితరులు పాల్గొన్నారు.






