బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణిదాడి
- ఎర్బిల్‌లో యూఎస్ సైనిక స్థావరం, ఖతార్‌పైన డ్రోన్ల దాడి
- యూఎస్ ఎంక్యూ-9 డ్రోన్ కూల్చివేత
టెహ్రాన్/మనామా, మార్చి 6: పశ్చిమ ఆసియాలో అమెరికా_ ఇరాన్ మధ్య జరుగుతున్న వైమానిక, డ్రోన్ల, క్షిపణుల భీకర దాడులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఇరాన్ సైన్యం కూడా దాడులను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతున్నామని తెలిపింది. అవసరమైతే అమెరికా గ్రౌండ్ ఫోర్సెస్ ప్రవేశించినా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి హెచ్చరించారు.
ఇరాక్‌లోని ఎర్బిల్ సమీపంలోని యూఎస్ సైనిక స్థావరాన్ని ఇరాన్ రెండు డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయి. ఇరాక్‌లోని ఎర్బిల్ విమానాశ్రయం సమీపంలోని యూఎస్ సైనిక స్థావరంపై శుక్రవారం రెండు డ్రోన్లు దాడి చేశాయని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. పశ్చిమ నగరమైన ఖాసర్- ఏ షిరిన్ సమీపంలో ఇరాన్ వైమానిక రక్షణ దళం ఒక అధునాతన యూఎస్‌ఎంక్యూ9 డ్రోన్‌ను కూల్చివేసింది. ఎంక్యూ-9 అనేది మీడియం- ఎత్తులో ఉండే మానవరహిత వైమానిక వాహనం. ఇది రిమోట్ లేదా స్వయంగా విమాన కార్యకలాపాలను నియంత్రించగలదు. పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతోంది.
బహ్రెయిన్ రాజధాని మనామాలో ఒక హోటల్, రెండు నివాస భవనాలపై ఇరాన్ క్షిపణి దాడి చేసిందని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. ఒక నివాస భవనంలో అగ్నిప్రమాదం చోటుకున్నదని, ఆ మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారని పేర్కొన్నారు.
ఇదే సమయంలో అల్‌ఖర్జ్ గవర్నరేట్, ఈస్ట్రన్ రీజియన్ ప్రాంతాల్లో డ్రోన్ల దాడులను కూడా అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. ఖతార్ అల్ ఉదైద్ ఎయిర్‌బేస్‌ను లక్ష్యంగా చేసుకుని వచ్చిన ఇరాన్ డ్రోన్ దాడిని తిప్పికొట్టామని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఏడోరోజైన శుక్రవారం కూడా ఇరాన్ ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలపై మరిన్ని క్షిపణి దాడులు కొనసాగించింది. మరోవైపు లెబనాన్‌లో ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా లక్ష్యాలపై కొత్తగా దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ దాడుల్లో కనీసం 8 మంది మృతిచెందినట్లు లెబనాన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.




