5 March, 2026 | 4:48 AM

రెండు దశల్లో ఐపీఎల్ షెడ్యూల్

05-03-2026 01:27 AM

పలు రాష్ట్రాల్లో ఎన్నికలే కారణం

ముంబై, మార్చి 4 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌పై పలు రాష్ట్రాల ఎన్నికల ప్రభావం పడింది. ఈ కారణంగానే ఐపీఎల్ షెడ్యూల్ విడుదల ఆలస్యమవుతుండగా దీనిపై బీసీసీఐ స్పష్టతనిచ్చింది. మార్చి 6 లేదా 7 తేదీల్లో ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ షెడ్యూల్‌పై కసరత్తు చేస్తోంది. నిజానికి ఈ పాటికే ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ విడుదల కావాలి. మార్చి 26 నుంచి మొదలుపెట్టాలని అనుకున్నప్పటకీ మార్చి 28 నుంచి సీజన్ ఆరంభం కానుంది.

ఫైనల్ మే 31న జరగనుండగా.. షెడ్యూల్ ను మాత్రం బీసీసీఐ ఖరారు చేయలేదు. దీనికి కారణంగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడమే. ఎన్నికల నిర్వహణ సమయంలో పోలీసు భద్రత, ఇతర ఏర్పాట్లు కష్టంగా మారతాయి. ఈ సారి పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడులో ఎన్నికలు జరగనుండగా.. ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఐపీఎల్ వేదికలున్నాయి. అందుకే ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన తర్వాతే అక్కడి నిర్వహించే మ్యాచ్‌లపై క్లారిటీ రానుం ది. ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ షెడ్యూల్‌ను రెండు దశల్లో విడుదల చేయనున్నారు.

మొదటి దశలో రెండు వారాలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటిస్తారు. ఈ టైమ్‌లో 20 నుంచి 25 మ్యాచ్‌లు జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఎన్నికల సంఘం ప్రకటించే ఆయా రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రెండో దశ షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. ఈ మేరకు ఫ్రాంచైజీలకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమాచారమిచ్చింది. ఎప్పటిలానే ఈ సారి కూడా డిఫెండింగ్ ఛాంపియన్ హోం గ్రౌండ్‌లో ఆరంభ మ్యాచ్ నిర్వహించనున్నారు.