4 March, 2026 | 1:34 AM

ఫైనల్ చేరేదెవరో?

04-03-2026 12:00 AM
  1. నేడు సౌతాఫ్రికా, కివీస్ తొలి సెమీస్
  2. ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్
  3. టోర్నీలో ఒక్క మ్యాచ్ ఓడని సఫారీలు
  4. అదృష్టంతో సెమీస్ చేరిన కివీస్

* 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో గెలుపు ముంగిట బోల్తా పడిన సౌతాఫ్రికా ఈ సారి కూడా టైటిల్ వేటలో దూసుకెళుతోంది. బుధవారం జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొనబోతున్న సఫారీలు టైటిల్‌కు రెండడుగుల దూరంలో నిలిచారు. మరోవైపు రన్‌రేట్ కారణంగా అదృష్టం కొద్దీ సెమీస్ వరకూ వచ్చిన న్యూజిలాండ్ అత్యుత్తమంగా రాణిస్తే తప్ప సౌతాఫ్రికాకు చెక్ పెట్టడం కష్టం. 

కోల్‌కత్తా, మార్చి 3 : టీ20 ప్రపంచకప్ నాకౌట్ స్టేజ్ కు చేరింది. 20 జట్లతో మొదలైన మెగాటోర్నీలో ఇప్పుడు నాలుగు జట్లే మిగిలాయి. సెమీఫైనల్స్ బుధవారం నుంచి మొదలుకానున్నాయి. తొలి సెమీస్‌లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ తలపడబోతున్నాయి. కోల్‌కత్తా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. గత ఎడిషన్ రన్నరప్‌గా నిలిచిన సౌతాఫ్రికా మరోసారి టైటి ల్‌పై కన్నేసింది.

తమ టైటిల్ కల నెరవేర్చుకునే క్రమంలో ఈ సెమీస్ అడ్డంకిని సఫా రీలు దాటాల్సి ఉంది. అటు న్యూజిలాండ్‌ను కూడా తక్కువ అంచనా వేసేందుకు వీలులేదు. చివరి సూపర్ 8 మ్యాచ్ లో ఓడిన ప్పటకీ ఈ మెగాటోర్నీలో కివీస్ బాగానే ఆడుతోంది. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ లో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఈ సెమీఫైనల్లో సౌతాఫ్రికాను హాట్ ఫేవరెట్‌గా భావిస్తున్నారు. ఎందుకంటే లీగ్ స్టేజ్ నుంచి సూపర్ 8 ముగిసే వరకూ ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు.

ముఖ్యంగా టైటిల్ ఫేవరెట్, డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియాను కూడా చిత్తుగా ఓడించింది. అన్ని విభాగాల్లోనూ మంచి ఫామ్‌లో ఉన్న సఫారీలు గత ఏడాది వరల్ టెస్ట్ ఛాంపియన్ షిప్ తో ఐసీసీ టైటిల్ వేట షురూ చేసింది. ఇప్పుడు టీ20 ఫార్మాట్ లోనూ విశ్వవిజేతగా నిలవాలన్న లక్ష్యంతో వరల్ కప్ ఆరంభం నుంచీ అద్భుతంగా రాణిస్తోం ది. బ్యాటింగ్‌లో మార్క్ రమ్, బ్రెవిస్ , స్టబ్స్, మిల్లర్‌పై అంచనాలున్నాయి. కెప్టెన్ మార్క్ రమ్ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా.. బ్రె విస్, స్టబ్స్ చివర్లో మెరుపులు మెరిపిస్తున్నారు. బౌలింగ్‌లో మార్కో యెన్సన్, రబా డ కూడా లైన్ అండ్ లెంగ్త్ అందుకున్నారు. 

మరోవైపు న్యూజిలాండ్ అదృష్టవశాత్తూ సెమీఫైనల్‌కు చేరింది. పాక్‌తో పాయింట్లు సమమైనా మెరుగైన రన్‌రేట్ కారణంగా ముందంజ వేసింది. శ్రీలంకపై గెలిచిన కివీస్ తర్వాత ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలైంది. కొన్ని మ్యాచ్‌లను చేజేతులా ఓడిపోవడం కూడా కివీస్ బలహీనతగా చెప్పొచ్చు. మిఛెల్ శాంట్నర్ కెప్టెన్సీలోని న్యూజిలాండ్‌కు బ్యాటింగ్ పరంగా కీలక ఆటగాళ్లే ఉన్నప్పటకీ నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నారు.

సిఫర్ట్ , ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్‌పై అంచనాలున్నాయి. చివర్లో శాంట్నర్ కూడా బ్యాట్‌తో మెరుపులు మెరిపిస్తుండడం కలిసొచ్చే అంశం. అయితే చాప్‌మన్, డారిల్ మిఛెల్ కూడా రాణిస్తే న్యూజిలాండ్ భారీస్కోరు సాధించే అవకాశముంటుంది. బౌలింగ్ లో ఫెర్గ్యుసన్, మ్యాట్ హెన్రీ రాణిస్తుండగా.. రచిన్ కూడా పార్టటైమ్ బౌలర్‌గా కీలకంగా మారాడు. అయితే సఫారీ బ్యాటింగ్ లైనప్‌ను కట్టడి చేయాలంటే కివీస్ బౌలర్లు సమిష్టిగా రాణించాల్సిందే.

ఇదిలా ఉంటే గత రికార్డుల్లో మాత్రం సౌతాఫ్రికాదే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 19 మ్యాచ్‌లలో తలపడితే 12 సార్లు సౌతాఫ్రికా గెలిచింది. కేవలం ఏడింటిలోనే కివీస్ విజయం సాధించింది. ఇక టీ20 ప్రపంచకప్‌లో ఒక్కసారి కూడా సఫారీలపై న్యూజిలాండ్ గెలవలేదు. ఈ ఎడిషన్‌లోనూ గ్రూప్ స్టేజ్‌లో సౌతాఫ్రికానే విజయం సాధించింది.

పిచ్ రిపోర్ట్ 

మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న ఈడెన్ గార్డెన్స్ బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. మంచు ప్రభావం కూడా ఉండనుండడంతో ఛేజింగ్ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.