శ్రీ ఆదివరాహ స్వామి జయంతి ఉత్సవాలకు మంత్రి శ్రీధర్‌బాబుకు తొలి ఆహ్వానం
కమాన్‌పూర్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండల కేంద్రంలోని స్వయంభూ ప్రసిద్ధ శ్రీ ఆదివరాహ స్వామి దేవస్థానంలో శ్రావణ మాసంలో నిర్వహించనున్న స్వామివారి జయంతి ఉత్సవాలకు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ఆలయ కమిటీ సభ్యులు తొలి ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం... శ్రావణ మాసం 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు స్వామివారి జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఈ మేరకు ఉత్సవాల ఆహ్వాన పత్రికను తొలి ఆహ్వానంగా మంత్రి శ్రీధర్‌బాబుకు అందజేశారు. కాటారం మండలం ధన్వాడ గ్రామంలోని మంత్రి స్వగృహంలో ఆలయ చైర్మన్ ముస్ట్యాల దామోదర్, ఈఓ కాంతారెడ్డి, ప్రధాన అర్చకులు వరప్రసాదాచార్యులు, ధర్మకర్తలు మంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందించారు.
అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు మంత్రి శ్రీధర్‌బాబును శాలువాతో సన్మానించి, స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు ప్రారంభించింది. స్వామివారి జయంతి ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.






