కుభీర్‌లో విషాదం.. చెరువులో మునిగి ఇద్దరు బాలుర మృతి
కుభీర్,(విజయక్రాంతి): కుభీర్ గ్రామంలో సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు బాలుర కుటుంబాల్లో డోడర్నా చెరువు తీరని విషాదాన్ని నింపింది. కుభీర్ కు చెందిన ముగ్గురు బాలురు డోడర్నా చెరువుకు ఈత కోసం వెళ్లారు. ఒక బాలుడు ఒడ్డున ఉండగా, సోఫియాన్(10), గణేష్ చెరువులోకి ఈతకు దిగారు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. స్థానికులు వెంటనే వారిని బయటకు తీశారు.
సోఫియాన్(10) అక్కడికక్కడే మృతి చెందాడు. గణేష్‌ను చికిత్స కోసం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పిల్లల మృతితో కుభీర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






