నేరస్తులకు శిక్షలు ఖరారయ్యేలా దర్యాప్తు చేయాలి
జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా పరిధిలోని వివిధ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలకు, నేరస్తులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. కార్యాలయంలో జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల అధ్యక్షతన పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో కలిసి డిస్ట్రిక్ట్ ప్రాసిక్యూటర్ రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా గ్రేవ్ కేసుల్లో కోర్టులలో వచ్చిన అక్విటల్ (విముక్తి) తీర్పులపై సమగ్రంగా సమీక్ష చేపట్టారు. కేసులు అక్విటల్ కావడానికి గల కారణాలు, దర్యాప్తు లోపాలు, సాక్ష్యాధారాల సమర్పణలో ఉన్న సమస్యలు, సాక్షుల హాజరు, ప్రాసిక్యూషన్ నిర్వహణ తదితర అంశాలపై విశ్లేషణాత్మకంగా చర్చించారు.
అలాగే, సంబంధిత కేసుల్లో అప్పీల్‌కు వెళ్లే అవకాశాలపై న్యాయపరమైన అంశాలను పరిశీలించి, అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. భవిష్యత్తులో ఇలాంటి కేసుల్లో బలమైన సాక్ష్యాధారాలు సమర్పించేందుకు దర్యాప్తు అధికారులు మరియు ప్రాసిక్యూషన్ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నేరస్తులకు శిక్షలు ఖరారు అయ్యేలా దర్యాప్తు నాణ్యతను మరింత మెరుగుపరచడం,
కోర్టు విచారణలో సాంకేతిక ఆధారాలను సమర్థంగా వినియోగించడంపై అధికారులు దృష్టి సారించాలని సమావేశంలో స్పష్టం చేశారు. జిల్లాలో న్యాయవ్యవస్థతో సమన్వయం పెంపొందించి, బాధితులకు న్యాయం అందేలా కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూటర్లు చేసిన సేవలను గుర్తించి, వారిని సత్కరించారు. అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సుదర్శన్ రెడ్డి, సతీష్, అరుణ, దేవేందర్,డి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ సమ్మయ్య, ఎస్ఐ ఉన్నారు.




