25 August, 2026 | 3:31 AM

రాకా ప్రపంచంలోకి..?

25-08-2026 12:00 AM

మలయాళంతోపాటు తెలుగు, తమిళ భాషల్లో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ ఎంతో బిజీగా గడుపుతోంది ఐశ్వర్య లక్ష్మి. ఇటీవల ‘గట్టకుస్తీ-2’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి తన ఖాతాలో హిట్ వేసుకున్న ఈ మలయాళ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో సాయిదుర్గాతేజ్ సరసన ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల కాకముందే.. తాజాగా, ఐశ్వర్య ఖాతాలో మరో బిగ్ ప్రాజెక్టు చేరినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడుగా తమిళ మాస్ డైరెక్టర్ అట్లీ ‘రాకా’ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలోనే ఐశ్వర్య లక్ష్మి ఒక కీలకమైన పాత్రలో నటించనుందట. ఇప్పటి వరకు ఎక్కువగా గ్లామరస్, పద్ధతి గల పాత్రల్లో కనిపించి మెప్పించిన ఐశ్వర్య.. ఈ సినిమాలో ఊహించని రీతిలో నెగటివ్ గ్రే షేడ్స్ ఉన్న శక్తిమంతమైన విలన్ పాత్రలో కనిపించబోతోందని టాక్. సాధారణ హీరోయిన్ రోల్స్ దాటి, ఇలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఎంచుకోవడంతో ఆమె నటనపై అందరిలోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ముంబయిలో శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా సెట్స్‌లోకి ఐశ్వర్య లక్ష్మి త్వరలోనే అడుగుపెట్టనుందట. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మాఫియా యాక్షన్ డ్రామాలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది.