పేద కుటుంబానికి ఇంటి పైకప్పు ఫౌండేషన్ చేయూత
* ఆపదలో ఉన్న పేదలకు సహాయం చేయడమే లక్ష్యం: జోగు అరవింద్ రెడ్డి
గరిడేపల్లి,(విజయక్రాంతి): ఆపదలో ఉన్న పేదలను ఆదుకోవడమే లక్ష్యంగా జోగు పిచ్చిరెడ్డి ఫౌండేషన్ పని చేస్తుందని ఆ సంస్థ కోశాధికారి, పొనుగోడు గ్రామ ఉపసర్పంచ్ జోగు అరవింద్ రెడ్డి తెలిపారు.మండల పరిధిలోని పొనుగోడు గ్రామంలో కోల రాములు కు చెందిన ఇంటిలో పైకప్పు పూర్తిగా దెబ్బతిని కూలిపోయే దశకు చేరిందని ఆయన తెలిపారు. పేద కుటుంబానికి చెందిన రాములు కుటుంబం ఇంటి పైకప్పు ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితిలో ఉండడం, పైకప్పును బాగు చేసుకునే పరిస్థితి ఆర్థికంగా లేకపోవడం గమనించి జోగు పిచ్చిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 15 వేల రూపాయలతో ఇంటి పైకప్పును పునర్నిర్మాణం చేసి ఆ కుటుంబానికి అండగా నిలిచినట్లు అరవింద్ రెడ్డి చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిరుపేదలు ఆపదలో ఉన్న కుటుంబాలకు సహాయం చేయడం లక్ష్యంగా జోగు పిచ్చిరెడ్డి ఫౌండేషన్ పని చేస్తుందని తెలిపారు. గత 30 సంవత్సరాలుగా సేవలందిస్తూ గ్రామంలో, మండలంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఫౌండేషన్ అందిస్తున్న సేవలను గుర్తించి పలువురు తమ ప్రోత్సాహాన్ని అందించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.






