5 June, 2026 | 2:06 AM

అంతర్జాతీయ డ్రగ్స్‌ముఠా గుట్టురట్టు

05-06-2026 12:36 AM
  1. థాయిలాండ్ టు హైదరాబాద్ స్మగ్లింగ్
  2. రూ.12 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి సీజ్ 
  3. ప్రధాన సూత్రధారితోపాటు మరో 16 మంది డ్రగ్ పెడ్లర్ల అరెస్ట్
  4. బ్యాంకాక్‌లో కిలో రూ.3లక్షలు..
  5. భారత్‌లో కిలోకు రూ.70 లక్షల రూ.1 కోటికి విక్రయం
  6. ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్

సికింద్రాబాద్, జూన్ 5(విజయక్రాంతి): అంతర్జాతీయ హైడ్రోపోనిక్ గంజాయి స్మగ్లిం గ్ ముఠాను తెలంగాణ ఈగల్ ఫోర్స్ గురువా రం ఛేదించింది. థాయిలాండ్ నుంచి భారత్‌కు అక్రమ రవాణా చేస్తున్న డ్రగ్స్ దందాను గుట్టురట్టు చేసింది. పోలీసులు, కస్టమ్స్ అధికారుల సమన్వయంతో నిర్వహించిన ఈ మెరుపు దాడిలో అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.12 కోట్ల విలువైన అత్యంత ఖరీదైన హైడ్రోపోనిక్ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారితోపాటు మొత్తం 16 మంది డ్రగ్ పెడ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈగిల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య వివరాలను వెల్లడించారు. విచారణలో, ఈ సిండికేట్ ముంబైకి చెందిన పాత అండర్వరల్ గ్యాంగ్లకు చెందిన షార్ప్ షూటర్లతో సహా ఇతర గ్యాంగ్ సభ్యులను నియమించుకున్నట్లు వెల్లడైంది. ప్రధాన సూత్రధారి ముంబైకి చెందిన హేమంగ్ ప్రమోద్ కెలుస్కర్‌గా తేల్చింది.

అతని సోదరుడుతో కలిసి థాయిలాండ్‌లో క్లబ్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు, ఈ క్లబ్ కేంద్రంగా డ్రగ్స్ స్మగ్లింగ్ సాగినట్లు వెల్లడించారు. ఈ సిండికేట్‌కు థాయిలాండ్, హైదరాబాద్, ముంబై కేంద్రాలుగా భారీ నెట్‌వర్క్ ఉన్నట్లు గుర్తింమని వెల్లడించారు. సుమారు 300 మంది క్యారియర్లను ఉపయోగించి, థాయిలాండ్ నుంచి భారత్‌కు హైడ్రోపోనిక్ గంజాయిని తరలించి, హైదరాబాద్, ముంబై, గుజరాత్ తదితర నగరాల్లో విక్రయించినట్లు  వెల్లడించారు.

ఈ గంజాయ్‌ని విదేశాల నుంచి ప్రత్యేక బ్యాగులలో ప్యాక్ చేసి, వివిధ విమానాశ్రయాల ద్వారా ఎవరికీ అనుమానం రాకుండా నగరానికి స్మగ్లింగ్ చేసేవారు. అలా తీసుకొచ్చిన ఖరీదైన గంజాయిని హైదరాబాద్‌లోని స్థానిక సబ్-పెడ్లర్లకు విక్రయిస్తూ, వారి ద్వారా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన యువతకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2026 ఏప్రిల్ 8 నుంచి ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈగిల్ ఫోర్స్) నిందితులను అరెస్టు చేసింది.

విశ్వసనీయ సమాచా రం మేరకు, ఈగిల్ ఫోర్స్ ఏప్రిల్ 8న ఇక్కడికి సమీపంలోని రామచంద్రపురంలో ఇద్దరు నిందితులను తొలుత అరెస్టు చేసి, రూ.12.7 కోట్ల విలువైన 12.739 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకుంది. విచారణలో, ఇద్దరు నిందితులు బ్యాంకాక్, హైదరాబాద్, ముంబైల మధ్య నడుస్తున్న డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌తో ఉన్న లింకులను వెల్లడించడంతో పాటు, పరారీలో ఉన్న తమ ఇతర సహచరుల పేర్లను కూడా తెలిపారు.

దీంతో ఈ డ్రగ్ కార్టెల్ ప్రధాన సూత్రధారి హేమాంగ్ కెలుస్కర్‌ను అరెస్టు చేశామని ఈగిల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. ఈగిల్ ఫోర్స్ నిరంతరం నిఘా ఉంచి హేమాంగ్ కెలుస్కర్‌ను అరెస్టు చేసిందన్నారు. ఈ సిండికేట్‌లో ముంబైకి చెందిన పాత అండర్‌వరల్డ్ ముఠాలకు చెందిన కొందరు సభ్యులు ఉన్నారని వెల్లడించారు. చెల్లింపులన్నీ నగదు రూపంలోనే స్వీకరించబడ్డాయన్నారు.

ఈ ఆదాయాన్ని హవాలాగా తిరిగి థాయ్‌లాండ్‌కు మళ్లించి, మళ్లీ పెట్టుబడిగా పెట్టారని తెలిపారు. దర్యాప్తులో 88 మంది కొరియర్ల పేర్లను గుర్తించారు. వీరు బ్యాంకాక్‌కు, అక్కడి నుంచితిరిగి మొత్తం172 పర్యాయాలు ప్రయాణించినట్లు వెల్లడైంది. బ్యాంకాక్‌లో కిలో రూ.3లక్షల చొప్పున కొనుగోలు చేసి, భారత్‌లో రూ.70 లక్షల నుంచి రూ.1 కోటి మధ్య విక్రయించినట్లు ఈగల్ డైరెక్టర్ తెలిపారు.

ఒక్కో ట్రిప్‌నకు రూ.20,000

ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో ముం బై, అమ్రేలి, సూరత్, జబల్పూర్, రాంచీ, లుధియానా, హైదరాబాద్‌కు చెందిన 29 మంది డ్రగ్ కొరియర్లను ఉపయోగించుకున్నారని, వారిని డీఆర్‌ఐ, కస్టమ్స్ అధికా రులు పట్టుకున్నారని తెలిసింది. వారు అక్టోబర్ 2023 నుంచి సుమారు రూ.200 కోట్ల నుంచి రూ. 250 కోట్ల విలువైన 250 కిలోల ఓజీ గంజాయిని తీసుకువచ్చి ఉంటారని ఈగల్ డైరెక్టర్ పేర్కొన్నారు.

ఈ డ్రగ్స్ ముఠా, థాయిలాండ్ నుంచి గంజా యి రవాణా చేసేందుకు తెలంగాణకు చెం దిన 14 మంది యువకులను ఒక్కో ట్రిప్‌నకు రూ.20,000 ఇస్తామనే ఆశ చూపి నియమించుకుం దని స్పష్టం చేశారు. వారు 21 సార్లు ఓజీ కుష్‌ను తీసుకువచ్చారని ఆయన వెల్లడించారు. ఆ 14 మందిలో 12 మందిని అరెస్టు చేశారు. ఒక్కో ట్రిప్‌నకు ఆరు కేజీల చొప్పున లెక్కించినా, వారు రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల విలువైన 120 కేజీల ఓజీ కుష్‌ను తీసుకువచ్చి నట్లేనని చెప్పారు.