calender_icon.png 7 February, 2026 | 8:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యథాతథంగా వడ్డీ రేట్లు

07-02-2026 12:00:00 AM

రెపోరేటులో మార్పులు లేవు

5.25 శాతం కొనసాగింపు:ఆర్బీఐ

డిజిటల్ మోసాల్లో పరిహారం ఇచ్చే ప్రతిపాదన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: కీలక వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) యథాతథంగా ఉంచింది. ఈ సారి రెపోరేటులోనూ ఎలాంటి మార్పులూ ఉండబోవని, 5.25 శాతం వద్దే కొనసాగిస్తామని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ద్రవ్యపరపతి  విధాన సమీక్ష నిర్ణయాలను ఆయన వెల్లడించారు.

2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఆర్‌బీఐ నిర్వహించిన మొదటి ద్వైమాసిక సమీక్ష వివరాలను ఆర్బీఐ గవర్నర్ వివరించారు. గతేడాది ఈ వర్డీరేట్లను ఆర్బీఐ అనేకసార్లు సవరించిన విషయం అందరికీ తెలిసిందే. 2025 ఫిబ్రవరి, ఏప్రిల్‌లో కీలక వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్ల వరకు ఆర్బీఐ తగ్గించింది. జూన్ సమీక్షలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు కుదించింది. ఆ తర్వాత డిసెంబర్‌లో మరో పావు శాతం తగ్గిచింది. దీంతో గతేడాది మొత్తంగా 1.25 శాతం వరకు రెపోరేటు పడిపోయింది. 

ఆర్బీఐ సమీక్ష కీలక అంశాలు ఇవే..

ద్రవ్యోల్బణం, వృద్ధి అంచనాలు సానుకూలంగా ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉంది. కార్పొరేట్ కంపెనీల పనితీరు మెరుగుపడడం, అసంఘటిత రంగంలో స్థిరమైన వృద్ధి తయారీకి ఊతమివ్వనుంది.

ఇటీవల కుదిరిన భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, త్వరలో జరగనున్న భారత్  ట్రేడ్ డీల్.. దేశీయ వృద్ధిని ఇంకా బలోపేతం చేయనున్నాయి. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7.4 శాతం వృద్ధికి చేరుతామని అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరం(2026 త్రైమాసికంలో 6.9శాతం, రెండో త్రైమాసికంలో 7శాతం వృద్ధి నమోదు అవుతుందని అంచనా వేశామని పేర్కొంది.

ప్రస్తత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 2.1శాతంగా ఉండొచ్చని అంచనా. 2026 సంవత్సరం తొలి త్రైమాసికంలో నాలుగు శాతం, రెండో త్రైమాసికంలో 4.2శాతం ద్రవ్యోల్బణం నమోదు కావచ్చని పేర్కొంది.

జనవరి చివరి నాటికి ఫారెక్స్ నిల్వలు 723.8బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వ్యవస్థలో ద్రవ్య లభ్యత రోజువారీ సగటున రూ.75వేల కోట్లుగా ఉంది.

పరిహార ప్రతిపాదన

ఇటీవలి కాలంలో కొత్త కొత్త మోసాలు వెలుగుచూస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులు చేసే సమయంలో బ్యాంక్ ఖాతాదారులు డిజిటల్ మోసాల బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే చిన్న మొత్తాల డిజిటల్ లావాదేవీల్లో మోసాలు జరిగినప్పుడు కస్టమర్లు నష్టపోకుండా ఉండేందుకు ఆర్బీఐ కొత్త ప్రతిపాదనలు ప్రకటించింది. రూ.25 వేల వరకు పరిహారం అందించనున్నట్లు పేర్కొంది. రికవరీ ఏజెంట్ల వేధింపులకు కూడా చెక్ పెట్టే దిశగా కీలక మార్గదర్శకాల్ని జారీ చేయనుంది. ఇది బ్యాంక్ ఖాతాదారుల ప్రయోజనాల్ని కాపాడుతుందని స్పష్టం చేశారు. ఇక్కడ పరిహారం అందించడం వల్ల బాధితుడికి కాస్తయినా ఊరట దక్కుతుందని ఆర్బీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.