13 August, 2026 | 2:12 AM

అంతర్ రాష్ట్ర బైక్ దొంగతనాల ముఠా గుట్టురట్టు

13-08-2026 01:00 AM
  1. వరుస బైక్ దొంగతనాలకు చెక్ పెట్టిన జిల్లా పోలీసులు
  2. ఐదుగురు దొంగలు, ముగ్గురు దొంగ బండ్లు కొనుగోలు చేసిన వ్యక్తులు అరెస్ట్
  3. నిందితుల నుంచి 44 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
  4. వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠాను అరె స్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బుధవారం పోలీస్ హెడ్క్వార్టర్స్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు.

ఈ నెల 6న ఇచ్చోడ శుభాష్ నగర్ కాలనీకి చెందిన ధరాడే బాలాజీ తన ఇంటి ఆవరణలో పార్క్ చేసిన మోటార్ సైకిల్ గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించినట్లు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ద్విచక్ర వాహనాల దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పోలీసులు సిసిటీవీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారంతో నిందితు(మారంపెళ్లి అనిల్, షేక్ షబ్బీర్, షేక్ ముస్తాషాహిద్, మహమ్మద్ జాకీర్, మహమ్మద్ షఫీ)లను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు.

నిందితులు గత కొంతకాలంగా మరి కొందరితో కలిసి ముఠాగా ఏర్పడి అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇచ్చోడ, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో సుమారు 44 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు వెల్లడించారు. వాహనాల నంబర్ ప్లేట్లను మార్చి, ఇతరులకు విక్రయించారు. నిందితుల సమాచారం మేరకు పోలీసులు 44 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.

అలాగే దొంగిలించిన వాహనాలను కొనుగోలు చేసిన గుండాల, కేశవపట్నం గ్రామాలకు చెందిన ముజాహిద్, ఇక్బాల్, కరీంలను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఇంకా సుమారు 20 మంది వాహనాలను కొనుగోలు చేసిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారన్నారు. మరో వైపు స్వాధీనం చేసుకున్న వాహనాల అసలు యజమానులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది అని, గతంలో జరిగిన ఇతర ద్విచక్ర వాహనాల దొంగతనాలపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నామున్నారు.

సాంకేతిక ఆధారాలతో చాకచక్యంగా దర్యాప్తు చేసి అంతర్రాష్ట్ర బైక్ దొంగతనాల ముఠాను పట్టుకుని 44 ద్విచక్ర వాహనాలను రికవరీ చేసిన ఇచ్చోడ పోలీసులను అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, ఇచ్చోడ ఎస్హెచ్‌ఓ కె. నరేష్ కుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.