9 May, 2026 | 8:38 AM

తుమ్మిడిహట్టిని పునరుద్ధరిస్తాం

09-05-2026 12:00 AM

అందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది 

మంత్రి జూపల్లి కృష్ణారావు

ఇరిగేషన్ అధికారులతో కలిసి ప్రాణహిత బరాజ్ ప్రాంతం పరిశీలన, సమీక్ష

కుమ్రంభీం ఆసిఫాబాద్, మే 8 (విజయక్రాంతి): తుమ్మిడిహట్టి ప్రాజెక్టును పునరుద్ధరించి, ప్రాణహిత నదీ జలాలను సాగునీటి అవసరాలకు వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. గత ప్రభుత్వం పక్కనబెట్టిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత సుజల స్రవంతి ప్రా జెక్టుకు పునరుజ్జీవం కల్పించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

శుక్రవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహట్టి వద్ద ప్రతిపాదిత ప్రాణహిత బరాజ్ ప్రాంతాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి, ఇరిగేషన్ అధికారులతో కలిసి మంత్రులు జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థా యిలో పరిశీలించారు. బరాజ్ ఎత్తు, నిల్వ సామర్థ్యం, కాల్వల నిర్మాణం, ముంపు ప్రాంతాలు, అటవీ, పర్యావరణ అనుమతుల అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వ హించారు. అనంతరం ప్రాణహిత నదికి జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్కర ఘాట్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. తుమ్మిడిహట్టి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి వరకు గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశం ఉందని, దీంతో విద్యుత్ ఖర్చు లేకుండానే సాగునీరు అందించవచ్చన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.38,500 కోట్ల అంచనా వ్యయంతో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రాణహిత ప్రాజెక్టును ప్రారంభించారని గుర్తు చేశారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టును పక్కనబెట్టి కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు ఖర్చు చేసి రాష్ట్ర ఖజానాపై భారాన్ని మోపిందని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడంతో ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఉపయోగపడటం లేదనిపేర్కొన్నారు.    మరో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ మాజీ సీఎం కే. చంద్రశేఖర్ రావు కమీషన్ల కోసమే ప్రాణహిత ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరం వైపు మళ్లించారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్ బాబు, గడ్డం వినోద్‌కుమార్, కలెక్టర్ హరిత, ఎస్పీ నితికా పంత్  తదితరులు పాల్గొన్నారు.