ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన
కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్, మార్చి 9 (విజయ క్రాంతి) : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ లు సోమవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిబంధనలకు అనుగుణంగా ఈవీఎం గోడౌన్ సీల్ ను తెరిపించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈవీఎం గోడౌన్ వద్ద భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలన్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఇతర సామాగ్రికి నష్టం వాటిల్లకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అగ్నిమాపక శాఖ అధికారి శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సిబ్బంది సాత్విక్, విజేందర్ తదితరులు ఉన్నారు.




