చిట్యాలలో టీటీడీ కల్యాణ మండపం భూమిపై సమగ్ర విచారణ జరిపించాలి
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల పట్టణంలో టీటీడీ కల్యాణ మండపం నిర్మాణం కోసం కేటాయించిన భూమికి సంబంధించిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఏసీబీ, విజిలెన్స్ శాఖలతో సమగ్ర విచారణ నిర్వహించి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరారు.
సుమారు 16 ఏళ్ల క్రితమే చిట్యాలలో టీటీడీ కల్యాణ మండపం నిర్మించాలని కోరుతూ పెద్దలతో కలిసి తాను నిరాహార దీక్ష చేపట్టిన విషయాన్ని సంజయ్ దాస్ గౌడ్ గుర్తు చేశారు. అప్పటి కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన లిఖితపూర్వక హామీ మేరకు నిరాహార దీక్ష విరమించినట్లు తెలిపారు. టీటీడీ కల్యాణ మండపం భూమికి సంబంధించిన వాస్తవాలను అధికారిక రికార్డుల ఆధారంగా వెలికితీయకుండా చిట్యాల మున్సిపల్ చైర్మన్ దంపతులపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు.
ప్రజల చందాలతో భూమి కొనుగోలు చేసినట్లు చెబుతున్న నేపథ్యంలో భూమి విస్తీర్ణంలో 1.12 గుంటలు తగ్గినట్లు పేర్కొంటున్న అంశంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను తేల్చాలని డిమాండ్ చేశారు. భూమి కబ్జాకు గురైందా? భూమి కొలతల్లో తేడాలు ఎలా వచ్చాయి? గతంలో ఉన్న రికార్డులు, హామీలు ఏమిటి? ప్రస్తుతం భూమి పరిస్థితి ఏమిటి? అనే అంశాలపై అధికారిక రికార్డులను పరిశీలించి స్పష్టత ఇవ్వాలని కోరారు.
ప్రభుత్వ భూమి లేదా టీటీడీకి సంబంధించిన భూమి విషయంలో ఎలాంటి అక్రమాలు జరిగినట్లు తేలినా, అందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంజయ్ దాస్ గౌడ్ కోరారు. రాజకీయ పార్టీలకు అతీతంగా చిట్యాల ప్రజలందరూ ఈ అంశంపై సమరశీల పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజల ప్రయోజనాల కోసం అవసరమైతే తాను మళ్లీ నిరాహార దీక్ష చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. టీటీడీ కల్యాణ మండపం భూమికి సంబంధించిన పాత రికార్డులు, గతంలో ఇచ్చిన హామీలు, భూమి కొలతలు, ప్రస్తుత స్థితిగతులపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.






