14 August, 2026 | 11:02 PM

బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీసీపీ భాస్కర్

14-08-2026 09:53 PM

బెల్లంపల్లి,( విజయ క్రాంతి): మంచిర్యాల జోన్ పరిధిలోని బెల్లంపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్‌ను మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పనితీరు,నేరాల దర్యాప్తు పురోగతి, ప్రజలకు అందుతున్న పోలీస్ సేవలను నిరంతరం పర్యవేక్షించడంలో భాగంగా డీసీపీ ఈ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రతను పాటించాలని సూచించారు.

వివిధ నేరాల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను క్రమబద్ధంగా ఉంచాలని ఎస్‌ఐ తిరుపతినీ ఆదేశించారు. రిసెప్షన్ కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించి,వారి సమస్యలను చట్టపరంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 

పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించి, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్‌లో నిర్వహిస్తున్న రికార్డులు,వివిధ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఎస్‌ఐ, స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ రైటర్లతో మాట్లాడి కేసుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం,రికార్డులను సక్రమంగా అప్‌లోడ్ చేయడం వంటి అంశాలపై ఆరా తీశారు.ఈ తనిఖీలో బెల్లంపల్లి రూరల్ సీఐ హనూక్  పాల్గొన్నారు.