25 March, 2026 | 1:48 AM

సింగరేణి మెడికల్ ఇన్ వాలిడేషన్‌పై విచారణ

25-03-2026 12:17 AM

మండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): 2014 నుంచి 2023 వరకు ఐదు సంవత్సరాల కాలంలో సింగరేణిలో 13,119 మంది మెడికల్ ఇన్‌వాలిడేషన్ జరిగిందని, అవసరం లేకపోయినా అలా చేయడం వల్ల సింగరేణిపై ఆర్థికంగా భారం పడుతుందని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పెద్ద సంఖ్యలో జరిగిన మెడికల్ ఇన్‌వాలిడేషన్‌పై ఏసీబీ, విజిలెన్స్ విచారణ జరిపిస్తున్నామన్నారు.

శాసనమండలిలో సింగరేణిలో మెడికల్ ఇన్ వాలిడేషన్‌పై సభ్యులు మధుసూదనాచారి అడిగిన ప్రశ్నకు భట్టి సమాధానమిచ్చారు. 2000 సంవత్సరం నుంచి 2014 వరకు 14 సంవత్సరాల కాలంలో మెడికల్ ఇన్వాల్యుయేషన్ సంఖ్య 3,859 మాత్రమే అన్నారు. మెడికల్ ఇన్వాల్యుయేషన్ దుర్వినియోగం అవుతుందని భావించి కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్డ్ ఫీల్డ్‌లో నిబంధనలు పరిశీలించి నామినేటెడ్ సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశామన్నారు.

మెడికల్ ఇన్ వాలిడేషన్ వారిని వదిలేయకుండా మానవీయ కోణంలో పరిశీలించి వారిపై ఆధారపడిన కుటుంబాలను అనుమతించాలని నిర్ణయించామన్నారు. గత రెండు సంవత్సరాల్లో 14 సార్లు మెడికల్ బోర్డుల సమావేశం జరగగా 2024లో 1041 మందికి, 2025లో 949 మందికి మెడికల్ ఇన్‌వాలిడేషన్ కింద డిపెండెంట్స్‌కు ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. మారుతున్న మార్కెట్ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మానవీయ కోణంలో సింగరేణిలో రేషనలైజేషన్ కోసం ప్రయత్నం జరగాలన్నారు.