ఎల్పీజీ కొరతతో ఇబ్బందులు
- ప్రజలను మభ్యపెడుతున్న ప్రభుత్వాలు
- కొరత లేదని కేంద్రం, సప్లయి లేదని రాష్ట్రం
- గ్యాస్ కొరత లేకుండా చర్యలు చేపట్టాలి
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- గన్‌పార్క్ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన
హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): గ్యాస్ సరఫరాపై కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ప్రజలను మభ్య పెడుతున్నాయని, కొరత లేదని కేంద్రం, సప్లయి లేదని రాష్ట్రం దాటవేస్తున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. యుద్ధం ప్రారంభమయ్యాక ఎల్పీజీ కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయినా కేంద్ర ప్రభుత్వం కొరత లేదని ప్రజలకు నమ్మబలుకుతోందన్నారు. క్షేత్ర స్థాయిలో మాత్రం గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్ కొరతపై మంగళవారం గన్‌పార్క్ వద్ద సిలిండర్ల ప్లకార్డులతో కేటీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. అనంతరం అదే ప్లకార్డులతో నిరసన తెలుపుతూ అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ సరఫరా అంశంపై ప్రజలకు నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవైపు ప్రభుత్వాలు కొరత లేదని చెపుతూనే మరోవైపు హోటళ్లు, చిరు వ్యాపారులకి గ్యాస్ సరఫరాను నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో సాధారణ ప్రజానీకంతో పాటు చిరు వ్యాపారులకు, హోటల్ వ్యాపారంపై ఆధారపడిన లక్షల మంది ప్రజల ఉపాధికి తీవ్ర విఘాతం కలుగుతున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో నెలకొన్న గ్యాస్ సరఫరా సంక్షోభంపై స్పందించి ప్రజలకు నిజాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు.
గ్యాస్ సరఫరాను పెంచేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం అధీనంలో పెట్రోలియం శాఖ ఉందని, తామేమీ చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం అంటోందన్నారు. భవిష్యత్‌లో గ్యాస్ సిలిండర్ సైజ్ తగ్గిస్తారన్న అనుమానాలున్నాయని, 14 కిలోల గ్యాస్ సిలిండర్‌ను 10 కిలోలకు తగ్గిస్తారని తెలుస్తోందన్నారు.




