9 August, 2026 | 2:28 AM

శ్రీశైలానికి తగ్గిన ఇన్‌ఫ్లో

09-08-2026 12:00 AM
  1.   1,68,020 క్యూసెక్కుల నీటి రాక
  2.   176 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ

 నాగర్‌కర్నూల్ ఆగస్టు 8 (విజయక్రాంతి ): శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో జూరాల ప్రాజెక్టు నుంచి కూడా ఇన్‌ఫ్లో తగ్గింది. శుక్రవారం సాయంత్రం 2,17,844 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా, శనివారం రాత్రి 1,68,020 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, 877.70 అడుగులుగా నమోదైంది.  మొత్తం నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను, 176 టీఎంసీలకు పైగా నీరు చేరింది.

జూరాల ప్రాజెక్టు నుంచి పవర్‌హౌస్ ద్వారా 29,525 క్యూసెక్కులు, స్పిల్‌వే ద్వారా 1,38,495 క్యూసెక్కులు మొత్తంగా 1,68,020 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా శ్రీశైలం  నుంచి విద్యుదుత్పత్తి కోసం 62,493 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ కుడి విద్యుత్ ఉత్పాదన కేంద్రం ద్వారా 27,178 క్యూసెక్కులు, తెలంగాణ ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు.