9 May, 2026 | 2:34 AM

ఉపాధి పనులు మొదలై.. వసతులు కరువై..!

09-05-2026 01:18 AM

అవస్థలు పడుతున్న కూలీలు

ప్రైవేటు వ్యక్తులతో ఎంబీలు, లేబర్ పేమెంట్ లతో తప్పని తిప్పలు

పని ప్రదేశాల్లో కరువైన అధికారుల పర్యవేక్షణలు

వసతులు కల్పించి ఇబ్బందులు తొలగించాలని వేడుకోలు

తుంగతుర్తి, మే 8: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కనీస వసతులు, కల్పించడంలో అధికారులు విఫలం కావడంతో, పనిచేసే కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.

మండుటెండల్లో మారని తీరు

మండలంలోని పలు గ్రామాల్లో మండుటెండల్లో ఉపాధి హామీ పనులు జోరుగా నడుస్తున్నాయి. ఉదయం 7 గంటల నుండి 12 గంటల వరకు సమయంలో ఎక్కువ పనులు నడుస్తున్నాయి. దీనితో పనిచేస్తున్న కూలీలకు కనీస వసతులు అయిన టెంటు, మంచినీటి సౌకర్యం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కనబడకుండా పోయినాయి. దీనితో ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు పని చేస్తే కేవలం 280 నుంచి 310 వరకు డబ్బులు పడుతున్నట్లు తెలుపుతున్నారు.

ఈ సంవత్సరం కొత్తగూడెం గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తూ ఎండకు సొమ్మసిల్లి మృతి చెందిన సంఘటన విధితమే. సంబంధిత అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వస్తూ, హాజరు వేసుకుంటూ, కాలం గడుపుతున్నారు. ఉపాధి పనుల్లో ముఖ్యంగా సాగునీటి కాలువల, చెరువుల పూడిక తీయడం గుంటలు చెరువులో పిచ్చి చెట్లను తీసివేయడం, మట్టి తీయడం, వంటి పనులు కొనసాగుతున్నాయి. గత 15 రోజుల తరబడి ఉదయం పూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో, పనుల్లో వసతులు కరువై ఇబ్బందులకు గురవుతున్నట్లు పనిచేసే కూలీలు చెబుతున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం కనీస వసతులు కల్పించవలసిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ నిధుల కొరత అని చెబుతుండడం గమనార్హం.

ప్రైవేట్ వ్యక్తులతో పనులు ?

ప్రవేట్ వ్యక్తులతో పనిచేసిన ఎంబీలు  కొట్టడం, లేబర్ పేమెంట్ లు చేయించడం పైన స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి,లోకల్ వ్యక్తి సి ఓ గా ఎలా అవకాశం ఇస్తారు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి మస్టర్ తీయడం, పని చేయకుండా, ఫీల్ మీదకు పోయి, ఫ్యామిలీతో అటెండెన్స్ వేసుకోవడం వంటి పనులు చేస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫీల్ అసిస్టెంట్ కు తెలియకుండా మస్టర్ తీయడం కూడా జరుగుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. జరుగుతున్న సంఘటనలపై జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయిలో విచారణ జరిపి, కనీస వసతులు కల్పించి, నిర్లక్ష్యం వహిస్తున్న మండల ఉపాధి హామీ అధికారులపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

వసతులు కల్పిస్తున్నాం

గ్రామాల్లో అనునిత్యం జరుగుతున్న ఉపాధి పనుల వద్ద వసతులు కల్పిస్తున్నాం. నిధుల కొరత కారణంగా కొన్నిచోట్ల పూర్తిస్థాయిలో వసతులు ఏర్పాటు కాలేదు. సాధ్యమైనంత త్వరలో అన్నిచోట్ల పూర్తిస్థాయిలో వసతులు కల్పించి కూలీలకు ఇబ్బందులు లేకుండా చేస్తాం.

కృష్ణయ్య, ఏపీఓ, తుంగతుర్తి