9 May, 2026 | 2:48 AM

మొయినాబాద్‌లో ‘లావుణి’ మాయాజాలం

09-05-2026 12:45 AM

12 ఎకరాల ప్రభుత్వ భూమి పట్టాగా మార్పు?

చేవెళ్ల /మొయినాబాద్, మే 8 (విజయక్రాంతి): మండలంలోని తోల్కట్ట గ్రామంలో భారీ భూకుంభకోణం వెలుగుచూసింది. పేదలకు చెందాల్సిన ‘లావుణి’ పట్టా భూమిని, నిబంధనలకు విరుద్ధంగా పట్టా భూమిగా మార్చి, రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సర్వే నంబర్ 107లో జరిగిన ఈ అక్రమాలపై కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ లేబర్ సెల్ (INTUC) ప్రధాన కార్యదర్శి భానూరి శివశంకర్ గౌడ్ కలెక్టరేట్లో ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.

అసలేం జరిగింది?..

సర్వే నంబర్ 107లో 12.16 ఎకరాల భూమి 1954 నుంచి మహమ్మద్ మహబూబ్ సాబ్ తండ్రి దాదాసాహెబ్ పేరిట ‘లావుణి’ పట్టా (ఖరీజ్ ఖాతా)గా ఉంది. అయితే, కాలక్రమేణా ఎటువంటి అధికారిక ప్రొసీడింగ్స్ లేకుండానే పహానీలలో పేర్లు మార్చడం ప్రారంభమైంది. నిబంధనకు విరుద్ధంగా లావుణి పట్టా భూమిని అమ్మినా, కొన్నా పీవోటీ చట్టం-1977 ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.

కానీ, ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత నిబంధనలను తుంగలో తొక్కి, గతంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న 2 ఎకరాల గైరాన్ భూమిని కూడా కలిపి మొత్తం 4.39 ఎకరాలను మహమ్మద్ జానిమియా పేరిట పట్టాగా మార్చేశారు. రికార్డుల ప్రకారం ఈ సర్వే నంబర్లో మొత్తం 12.16 ఎకరాలు మాత్రమే ఉండాలి. కానీ ప్రస్తుతం ఆన్లైన్లో 14.16 ఎకరాలు చూపిస్తుండటం గమనార్హం. గైరాన్ భూమిలో తహసీల్దార్ బోర్డు ఉన్నప్పటికీ, ఆ భూమిని కూడా ప్రైవేట్ వ్యక్తుల ఖాతాలోకి చేర్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తెల్ల కాగితాలపై సంతకాలు.. కోట్లలో భూదందా..

భవాని డ్రీమ్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ వంగ ప్రణీత రెడ్డి అక్రమార్కులతో కుమ్మక్కై, అమాయక నిరక్షరాస్యులైన పట్టాదారులను మోసం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.లావుణి భూమిని పట్టాగా మార్చి వచ్చిన లాభాల్లో సగం ఇస్తామని నమ్మించి, తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారు.

పట్టాదారులకు తెలియకుండానే ’నో అబ్జెక్షన్’ పత్రాలు సృష్టించి, కేవలం రూ.6 లక్షల చెక్కు ఇచ్చి కోట్ల విలువైన భూమిని కంపెనీ పేరిట రిజిస్ట్రేషన్ (డాక్యుమెంట్ నెం. 3979/2023) చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. లావాణి భూ మాయ గురించి స్థానిక తాసిల్దార్ గౌతమ్ కుమార్ ను ఫోన్లో వివరణ కోరగా ఆ ప్రక్రియఅంతా గతం లో పనిచేసిన అధికారుల హయాంలో లో జరిగిందని  ఆ ఇష్యూ తో తనకు సంబంధంలేదని ఆయన పేర్కొన్నారు.

కలెక్టర్కు ఫిర్యాదు..

ఈ అక్రమ పట్టా మార్పిడి వెనుక ఉన్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని, అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని భానూరి శివశంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన ఫిర్యాదులపై స్పందన లేకపోవడంతో, తాజాగా మరోసారి పాత రికార్డులను జతచేసి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించి అసలైన అసైన్డ్ భూమిని కాపాడాలని బాధితులు కోరుతున్నారు.