5 May, 2026 | 7:59 PM

జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

05-05-2026 06:42 PM

గద్వాల టౌన్: జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని బలోపేతం చేసేందుకు మే 2026లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అదనపు కలెక్టర్ బి. నర్సింగ్ రావును ఉపాధ్యక్షుడు, ప్రత్యేక అధికారిగా, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ అధికారి వేణుగోపాల్ మరియు జిల్లా ఉపాధి కల్పన అధికారి చరణ్ దీప్‌లను నోడల్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మే 1 నుంచి 31వ తేదీ వరకు సభ్యత్వ నమోదు ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ విధానాల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ సులభంగా కొనసాగించేందుకు  కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక డేటా సెంటర్ ఏర్పాటు  చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి తాత్కాలిక డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను నియమిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, చురుకుగా పాల్గొని రెడ్ క్రాస్ సేవలకు మద్దతు ఇవ్వాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

రెడ్ క్రాస్ సంస్థ యుద్ధాలు,ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితులు వంటి సందర్భాల్లో జాతి, మతం, వర్ణ భేదాలు లేకుండా బాధితులకు సహాయం అందిస్తుందని తెలిపారు. ఆరోగ్య పరిరక్షణ, వ్యాధి నివారణ, విపత్తు సిద్ధత వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి సేవలందిస్తోందని తెలిపారు. సభ్యత్వ రుసుములు పేట్రన్ రూ.25,000, వైస్ పేట్రన్ రూ.12,000, లైఫ్ మెంబర్ రూ.1,000, సంస్థాగత సభ్యత్వం సంవత్సరానికి రూ.5,000 ఉంటుందని తెలిపారు. రెడ్ క్రాస్‌కు ఇచ్చే విరాళాలకు 80G కింద పన్ను మినహాయింపు ఉంటుందన్నారు. ఈ మానవతా సేవలో భాగంగా ప్రజలు విరాళాలు ఇవ్వడం, సభ్యత్వం పొందడం లేదా స్వచ్ఛంద సేవకులుగా పాల్గొనవచ్చని తెలిపారు.