భారత్ అండర్ జట్టు 411 ఆలౌట్
- కుశాగ్ర ఓజా, మనల్ చౌహన్ శతకాలు
- శ్రీలంకతో రెండో యూత్ టెస్ట్
కొలంబో, జూలై 21 : శ్రీలంక అండర్ 19 జట్టుతో జరుగుతున్న రెండో యూత్ టెస్టులో భారత్ అదరగొడుతోంది. బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 411 పరుగులకు ఆలౌటైంది. 253/3 ఓవ్నట్ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ దూకుడుగా ఆడింది. కుశాగ్ర ఓజా (111), ఆల్‌రౌండర్ మనాల్ చౌహాన్ (150) సెంచరీలతో చెలరేగగా, యశ్వర్దన్ చౌహాన్ (78) హాఫ్ సెంచరీతో రాణించాడు. శ్రీలంక బౌలర్లలో గిమ్హాన్ మెండిస్ 3 వికెట్లు తీయగా.. సెత్మిక సెనెవిరత్నె, దుల్నిత్ సిగెర, విఘ్నేశ్వరన్ ఆకాశ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక జట్టును భారత యువ బౌలర్లు బెంబేలెత్తించారు. దీంతో రెండోరోజు ఆటముగిసే సమయానికి లంక 8 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే శ్రీలంక ఇంకా 289 పరుగులు వెనుకబడి ఉంది. భారత బౌలర్లలో ప్రణవ్ రాఘవేంద్ర, చిగురుపాటి వెంకట, రోహిత్ యాదవ్ తలా రెండు వికెట్లు తీయగా.. కావ్యా పటేల్, జగన్నాథ్ హెంచుదేశన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.






