calender_icon.png 17 February, 2026 | 12:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఏఐ ఇంపాక్ట్’ సదస్సు ప్రారంభోత్సవం

17-02-2026 12:15:22 AM

ఢిల్లీలోని భారత్ మండప్ వేదికగా నిర్వహణ

ఐదురోజులు.. ౪౫ దేశాలకు చెందిన ప్రతినిధుల ప్రాతినిధ్యం

300 కార్పొరేట్ సంస్థలు, ౬౦౦ స్టార్టప్ కంపెనీల స్టాళ్లు

భారత యువత సామర్థ్యాలకు సదస్సు నిదర్శనం: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౧౬: దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత్ మండప్‌లో సోమవారం అట్టహాసంగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ ప్రారంభమైంది. ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా ఈ సదస్సును ప్రారంభించారు. కృత్రిమ మేధ రంగంలో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహిస్తున్నది. ఐదు రోజుల పాటు (౨౦వ తేదీ వరకు) జరిగే ఈ సదస్సుకు 45 దేశాలకు చెందిన కార్పొరేట్ సంస్థలు తరలిరానున్నాయి. 300కు పైగా స్టాళ్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే 600 స్టార్టప్ కంపెనీలు సైతం స్టాళ్లు తెరిచాయి. పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్ అనే మూడు ప్రధాన అంశాల ఇతివృత్తాలతో ఆయా సంస్థలు స్టాళ్లు ఏర్పాటయ్యాయి.

దేశ విదేశాల నుంచి సదస్సుకు విచ్చేసిన ప్రతినిధులు, ఏఐ నిపుణులు రోడ్డు భద్రత, వ్యవసాయ రంగం, న్యాయ వ్యవస్థలో ఏఐ వినియోగం వంటి కీలక అంశాలపై ప్రసంగించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ఏఐ ప్రభావంపైనా కొందరు మాట్లాడారు. మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ విపత్తు నిర్వహణలో కృత్రిమమేధ వినియోగంపై ప్రసంగిం చారు. గ్లోబల్ సౌత్‌దేశాల్లో జరుగుతున్న మొట్టమొదటి ఏఐ సదస్సు ఇదే కావడంతో, ఈ సదస్సు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

యువత సామర్థ్యాలకు సదస్సు నిదర్శనం: ప్రధాని మోదీ

భారత్ యువత సామర్థ్యాలకు ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో నిదర్శనంగా నిలుస్తుందని ప్రధాని మోదీ కొనియాడారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం పురోగమిస్తుందనడానికీ సదస్సు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ‘సర్వజన హితాయ..- సర్వజన సుఖాయ’ అనే స్ఫూర్తితో ఏఐ నిపుణులు యావత్ ప్రపంచ ప్రజల సంక్షేమం కోసం కృత్రిమ మేధను వినియోగించాలని పిలుపునిచ్చారు. గ్లోబల్ సౌత్ లో నిర్వహిస్తున్న మొట్టమొదటి అంతర్జాతీయ ఏఐ సదస్సు ఇదే కావడం దేశానికే గర్వకారణమని అభివర్ణించారు.

భారత్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నదని, దీనిలో భాగంగానే ఎంతోమంది యువ ఔత్సాహికులు స్టార్టప్‌లు ప్రారంభిస్తున్నారని కొనియాడారు. తద్వారా దేశీయ పరిశోధన రంగం పరిఢవిల్లుతుందని ఆకాంక్షించారు. ఇప్పటికే ఏఐ ద్వారా వైద్యారోగ్యం, వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు అందుతున్నా యని వివరించారు.