అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు
డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రం అర్వపల్లిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన బీఆర్ఎస్ బీఎల్ఏల సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గాదరి కిషోర్ లు సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలను విమర్శించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేద ప్రజల అభివృద్ధి కోసం 200 ఎకరాల్లో 2,160 ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించి ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని,అభివృద్ధికి ఉత్తమ్ బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు. శ్రీరాంసాగర్ కాలువ ప్రజల చిరకాల స్వప్నం అని,మాజీమంత్రి దామోదర్ రెడ్డి రక్త తర్పణంతోనే అది నెరవేరిందని చెప్పారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు భాష మార్చుకోవాలని లేని పక్షంలో తగిన గుణపాఠం చెబుతామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.






