సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నాం!
• నిరుపేదలకు అండగా నిలుస్తున్నాం!
• చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి!
ధర్మపురి,(విజయక్రాంతి): సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ నిరుపేదలకు అండగా ఉంటున్నామనీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో నలుగురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులతో పాటు 91 మంది లబ్ధిదారులకు రూ 31 లక్షల 3వేల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి లక్ష్మణ్ కుమార్ అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కరీంనగర్ లో అందించే వారని ఇది పేద ప్రజలకు భారంగా ఉండేదని మంత్రి అన్నారు. ప్రజా ప్రభుత్వంలో ధర్మపురి నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులతో పాటు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల సైతం స్థానికంగా అందజేస్తున్నామని మంత్రి తెలిపారు.
గౌడన్నలకు అండగా నిలుస్తాం..
వెల్గటూర్ మండలం జగదేవ్ పేట గ్రామంలో ఇటీవల దగ్దమైన ఈతవనాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. అగ్ని ప్రమాదంతో జరిగిన తీరును, నష్టం వివరాలను స్థానిక గౌడ సంఘం నాయకులు మంత్రికి వివరించారు. నష్టపోయిన గౌడన్నలకు ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయం అందిస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.






