17 June, 2026 | 10:54 PM

జవహర్ నగర్... ప్రధాన రోడ్డు విస్తరణ పనుల్లో నాణ్యతా లోపాలు

17-06-2026 09:12 PM

డిస్మెంటల్ మెటీరియల్ తో రోడ్డు మరమ్మత్తులు... విచారణ జరిపించండి

సిపిఐ మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జి తోటపల్లి శంకర్

జవహర్ నగర్,(విజయక్రాంతి): జవహర్ నగర్ ప్రధాన రోడ్డు విస్తరణ పనుల్లో తీవ్రమైన నాణ్యత లోపాలు జరుగుతున్నాయని డిస్మెంటల్ మెటీరియల్ తో రోడ్డు మరమ్మత్తులు జరుపుతున్నారని దీనిపై వెంటనే విచారణ జరిపించాలని సిపిఐ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి తోటపల్లి శంకర్ డిమాండ్ చేశారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో జవహర్ నగర్ నుండి చెన్నాపూర్ వెళ్లే 100 ఫీట్ల ప్రధాన రహదారి విస్తరణ మరమ్మత్తు పనుల్లో తీవ్రమైన నాణ్యత లోపాలు జరుగుతున్నాయని సిపిఐ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి తోటపల్లి శంకర్ ఆరోపించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం సిపిఐ నాయకత్వ బృందం జవహర్ నగర్ చెన్నాపురం ప్రధాన రహదారిని క్షేత్రస్థాయిలో పరిశీలించిందని రోడ్డు మధ్యలో ఉన్న పెద్ద విద్యుత్ స్తంభాలను తొలగించకుండానే అలాగే వదిలేసి రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం అధికారుల బాధ్యతరాహిత్యానికి నిదర్శనం అన్నారు. నెలల తరబడి ఈ రోడ్డు విస్తరణ పనులు సాగదీయడం వల్ల నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజల ప్రాణాలతో ఆటలాడడం తగదని ద్వజమెత్తారు.

ప్రస్తుతం జూన్ మాసం కావడంతో పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో సైకిళ్లపై వెళ్లే విద్యార్థులు రోడ్డు దుస్థితి  కారణంగా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారని తమ ఆందోళన వ్యక్తం చేశారు. మూలిగే నక్కపై తాటి కాయ పడ్డచందంగా ఇప్పటికే డంపింగ్ యార్డ్ కాలుష్యంతో నరకయాతన  అనుభవిస్తున్న జవహర్ నగర ప్రజల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైందని విమర్శించారు.

రోడ్డు పనుల ఆలస్యం వల్ల లేస్తున్న దుమ్ము ధూళితో స్థానిక ప్రజలు ప్రయాణికులు తీవ్రమైన శ్వాసకోశ సమస్యల బారిన పడుతున్నారని తమ ఆవేదన వ్యక్తం చేశారు. వీటికి తోడు ఇతర ప్రాంతాల నుండి తీసుకువచ్చిన డిస్మెంటల్ మెటీరియల్ ను ఇక్కడ రోడ్డు మరమ్మతులకు వాడుతూ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు మధ్యలో ఉన్న స్తంభాలను తొలగించి నాణ్యమైన మెటీరియల్తో యుద్ధ ప్రాతిపదికన రోడ్డు పనులను పూర్తిచేయాలని ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.